ఎయిర్‌ ఇండియా రేసులో టాటా

ABN , First Publish Date - 2020-12-15T06:45:56+05:30 IST

ప్రభుత్వ రంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ)ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ పోటీపడుతోంది.

ఎయిర్‌ ఇండియా రేసులో టాటా

ఏఐ ఉద్యోగుల బృందం -  ఇంటరప్స్‌ కన్సార్షియం సైతం బిడ్‌ దాఖలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఇండియా (ఏఐ)ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ పోటీపడుతోంది. అమెరికన్‌ ఫండ్‌ ఇంటరప్స్‌ ఇంక్‌తో కన్సార్షియంగా ఏర్పడి ఏఐ ఉద్యోగుల బృందం సైతం బరిలోకి దిగింది. ఏఐ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణల (ఈఓఐ)ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఓఐల సమర్పణకు గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజున టాటా సన్స్‌ సహా పలువురు ఈఓఐలు సమర్పించారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంతా పాండే ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.


అయితే, ప్రాథమిక బిడ్లు సమర్పించిన ఇతరుల పేర్లు, మొత్తం ఎన్ని ఈఓఐలు వచ్చాయన్న విషయాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాదు, టాటా గ్రూప్‌ ఒంటరిగానే లేదా కన్సార్షియంలో భాగంగా బిడ్‌ సమర్పించిందా..? అన్న విషయంలోనూ స్పష్టత లేదు. అర్హులైన బిడ్డర్లకు వచ్చే ఏడాది జనవరి 6 కల్లా సమాచారం అందించడం జరుగుతుందని అధికారి ఒకరు తెలిపారు. అర్హత సాధించిన బిడ్డర్లు తదుపరి ప్రక్రియలో భాగంగా ఫైనాన్షియల్‌ బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. 


అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ ఇంటర్‌ప్సతో కలిసి ఎయిర్‌ ఇండియాకు చెందిన 219 ఉద్యోగుల బృందం కూడా ఈఓఐ సమర్పించింది. ఈ ఉద్యోగ బృందానికి నాయకత్వం వహిస్తోన్న ఏఐ కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షి మాలిక్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఒంటరిగా బిడ్డింగ్‌లో పాల్గొనే ఆర్థిక సామర్థ్యం లేకపోవడంతోనే ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ మద్దతులో ఈఓఐ సమర్పించినట్లు ఆమె చెప్పారు. బిడ్డింగ్‌ కోసం ఉద్యోగ బృందంలో ఒక్కొక్కరూ కనీసం రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా ఈ కన్సార్షియంలో ఉద్యోగ బృందం 51 శాతం వాటా కలిగి ఉండనుంది. 


ఈ ఏడాది ప్రారంభంలో  ఈఓఐలకు ఆహ్వానం 

ఎయిర్‌ ఇండియా విక్రయం కోసం ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈఓఐలను ఆహ్వానించింది. ఈ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్‌) ప్రక్రియలో భాగంగా  ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాతోపాటు చౌక విమానయాన సేవల విభాగమైన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రె్‌సలోనూ 100 శాతం వాటా విక్రయించనుంది. అలాగే,  ‘ఎయిర్‌ ఇండియా శాట్స్‌’ (ఏఐఎ్‌సఏటీఎ్‌స)లోనూ ఎయిర్‌ ఇండియాకున్న 50 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. ఈ బిడ్డింగ్‌లో విజేతకు యాజమాన్య హక్కులను సైతం బదిలీ చేయనున్నారు.


2019 మార్చి 31 నాటికి ఎయిర్‌ ఇండియాపైనున్న రుణ భారం రూ.60,074 కోట్లు. అందులో రూ.23,286.5 కోట్లు ఎయిర్‌లైన్స్‌ కొనుగోలుదారు భరించాల్సి ఉంటుంది. మిగతా రుణాన్ని ఎయిర్‌ ఇండియా హోల్డింగ్‌ లిమిటెడ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌) పేరుతో ఏర్పాటు చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌కు బదిలీ చేయనున్నారు.


తొలి ప్రయత్నంలో ప్రభుత్వానికి గట్టి షాక్‌ 

నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ కోసం గడిచిన రెండేళ్లలో ప్రభుత్వానికిది రెండో ప్రయత్నమిది. తొలిసారి మోదీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ఎయిర్‌లైన్స్‌లో 76 శాతం వాటా విక్రయానికి 2018లో ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ సంస్థను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.


7 దశాబ్దాల తర్వాత మళ్లీ.. 

టాటా సన్స్‌ 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది. 1946లో దాని పేరును ఎయిర్‌ ఇండియాగా మార్చారు. 1953లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను తన ఆధీనంలోకి తీసుకుంది. దాదాపు 7 దశాబ్దాల తర్వాత (67 ఏళ్లు) ఏఐని తిరిగి దక్కించుకునేందుకు టాటా సన్స్‌ బరిలోకి దిగింది. 1995లోనే టాటా గ్రూప్‌ కొత్త ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2001లోనూ టాటాలు ఎయిర్‌ఇండియాను తిరిగి దక్కించుకునేందుకు బిడ్‌ వేసినప్పటికీ.. ప్రభుత్వం వాటా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంతో సాధ్యపడలేదు. ప్రస్తుతం టాటా సన్స్‌ రెండు విమాన సంస్థలను నిర్వహిస్తోంది. మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా గ్రూప్‌తో కలిసి ఎయిర్‌ ఏషియా ఇండియాను ఏర్పాటు చేసింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారాను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌ల్లోనూ టాటా సన్స్‌దే మెజారిటీ (51 శాతం) వాటా. 

Updated Date - 2020-12-15T06:45:56+05:30 IST