భారత్‌కు ఎఫ్‌డీఐల బలం

ABN , First Publish Date - 2020-12-30T06:47:13+05:30 IST

దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతా ల్లో ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలబడగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రాబోయే కాలంలో తన

భారత్‌కు ఎఫ్‌డీఐల బలం

 యునెస్కాప్‌ నివేదిక


ఐక్యరాజ్య సమితి: దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతా ల్లో ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలబడగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రాబోయే కాలంలో తన సామర్థ్యం నిరూపించుకుంటుందని ఐక్యరాజ్య సమితి ఆసి యా, పసిఫిక్‌ ప్రాంతాల ఆర్థిక, సామాజిక కమిషన్‌ (యునెస్కాప్‌) తాజా నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా వృద్ధి క్షీణించినా భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులను ఆకర్షించడం సానుకూలత అని ‘ఎఫ్‌డీఐ ధోరణులు-2020-2021లో ఆసి యా పసిఫిక్‌ ధోరణులు’’ పేరిట సంపుటీకరించిన ఆ నివేదికలో పేర్కొంది.


2019లో దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతంలోకి ఎఫ్‌డీఐ పెట్టుబడులు 2 శాతం తగ్గినా అందులో 77 శాతం పెట్టుబడులను భారత్‌ ఆకర్షించిందని తెలిపింది. 2019లో భారత్‌ 5,100 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించిందని, 2018తో పోల్చితే ఇది 20 శాతం అధికమని పేర్కొంది. ఈ పెట్టుబడుల్లో కూడా అధిక శాతం ఐసీటీ, నిర్మాణ రంగాల్లోకి వచ్చిందని తెలిపింది. పలు బహుళజాతి కంపెనీలు భారత్‌లో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ఈ-కామర్స్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. అదే ఏడాది భారత్‌ ఇతర దేశాల్లో 1210 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసిందని, ముందు ఏడాదితో పోల్చితే ఇది 10 శాతం అధికమని తెలిపింది.


అయితే స్వల్పకాలంలో మాత్రం ఈ ప్రాంతంలో ఎఫ్‌డీఐల రాక తగ్గవచ్చని అంచనా వేసింది. త్వరితంగా పెరుగుతున్న టెలికాం, డిజిటల్‌ రంగాలు వేగంగా పునరుజ్జీవం సాధించే ఆస్కారం ఉన్నట్టు తెలిపింది. 2025 నాటికి భారత ఐటి, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సేవలు, ఎలక్ర్టానిక్‌ తయారీ రంగాలు ప్రస్తుత స్థాయికి రెట్టింపయ్యే ఆస్కారం ఉన్నట్టు పేర్కొంది.  


Updated Date - 2020-12-30T06:47:13+05:30 IST