మరింత క్షీణత!
ABN , First Publish Date - 2020-03-13T07:37:59+05:30 IST
స్టాక్ మార్కెట్ మరింత క్షీణించవచ్చని బ్రోకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టాక్ మార్కెట్ మరింత క్షీణించవచ్చని బ్రోకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు మరింతగా క్షీణించగలవని, అందుకు అనుగుణంగా భారత మార్కెట్ కూడా క్షీణించగలదని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తూ.. గురువారం డోజోన్స్ భారీ నష్టంతో ప్రారంభమైంది.
కరోనా ప్రభావం తగ్గితే తప్ప ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధి రేటు అంచనాలపై అమెరికా కొద్దిగా ఆశలు పెట్టుకోవడానికి అవకాశాలు లేవు. అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని దేశీయంగా మదుపర్లు మార్కెట్‌పై విశ్వాసం ఉంచలేకపోతున్నారని.. ఇప్పటికే విశ్వాసాన్ని కోల్పోయారని హైదరాబాద్‌కు చెందిన శ్రీజా బ్రోకింగ్ కంపెనీ ఎండీ శేఖర్ తెలిపారు. నిఫ్టీ 9,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని శేఖర్ తెలిపారు. నిఫ్టీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత పీఈ నిష్పత్తి 18-19 శాతానికి చేరుతుందని.. సాధారణంగా స్థాయి వద్ద షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపుతారని అన్నారు. అందువల్ల మార్కెట్ మరింత తగ్గి అక్కడ స్థిరపడవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.