మార్చిలో స్పెక్ట్రమ్‌ వేలం

ABN , First Publish Date - 2020-12-17T07:19:19+05:30 IST

మరో విడత స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఇందుకు ఆమోద

మార్చిలో స్పెక్ట్రమ్‌ వేలం

రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం జూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: మరో విడత స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన మోదీ అధ్యక్షతన జరిగిన  కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఈ వేలం ఉంటుందని కేంద్ర ఐటీ, ప్రసార శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. నెల రోజుల్లో ఇందుకు నోటిఫికేషన్‌ జారీ కా నుంది. 


ప్రస్తుతం ఆపరేటర్ల వద్ద ఖాళీగా ఉన్న 700, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెడ్జ్‌  (ఎంహెచ్‌జడ్‌) ఫ్రీ క్వెన్సీ బ్యాం డ్స్‌లోని 2,251 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రమే ఈ వేలంలో వేలం వేస్తారు. 5జీ టెలికం సేవలకు ఉపయోగపడే అధిక సామర్థ్యం గల   3,300-3,600 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ వేలాన్ని మాత్రం  మినహాయించారు. 


రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం

ట్రాయ్‌ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3,92,332.70 కోట్ల ఆదాయం లభించనుంది. కంపెనీలు పోటీపడితే ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను బట్టి కంపెనీలు 25 నుంచి 50 శాతం ధరను ముందుగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని రెండేళ్ల విరామం తర్వాత 16 వార్షిక సమాన వాయిదాల్లో చెల్లించాలి. 


చెరకు రైతులకు రూ.3,500 కోట్లు

చక్కెర మిల్లుల నుంచి రైతులకు రావలసిన బకాయిల కింద రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు రూ.3,500 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. సెప్టెంబరుతో ముగిసే 2020-21 చక్కెర సీజన్‌కు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. దీని వల్ల దేశీయ చక్కెర మిల్లులు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేయగలుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. 




చైనా టెలికం దిగుమతులకు కళ్లెం!

టెలికం పరికరాల దిగుమతులకు సంబంధించీ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నేషనల్‌  సెక్యూరిటీ డైరెక్టివ్‌ ఆన్‌ టెలికం సెక్టర్‌ (ఎన్‌ఎ్‌సడీటీఎస్‌) పేరుతో ప్రత్యేక విధానానికి ఆమోదం తెలిపింది.  ఈ పాలసీ కింద కంపెనీలు దేశ భద్రతకు ప్రమాదం లేని విశ్వసనీయ కంపెనీల నుంచి మాత్రమే టెలికం పరికరాలు దిగుమతి చేసుకోవాలి. అలాంటి కంపెనీల జాబితాను, వాటి నుంచి దిగుమతి చేసుకోదగ్గ పరికరాల జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. హువావే వంటి చైనా కంపెనీల టెలికం పరికరాల దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చిందంటున్నారు.


Updated Date - 2020-12-17T07:19:19+05:30 IST