సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రత్యేకం

ABN , First Publish Date - 2020-05-24T06:44:25+05:30 IST

కరోనా సంక్షోభంలో పుట్టి మునిగిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ (రెపో) రేట్లను భారీగా తగ్గిస్తూ వస్తోంది. తాజాగా 20 ఏళ్ల కనిష్ఠ స్థాయికి దించింది. రెపో కోతలకు అనుగుణంగా బ్యాంకుల రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు వేగంగా...

సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రత్యేకం

కరోనా సంక్షోభంలో పుట్టి మునిగిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ (రెపో) రేట్లను భారీగా తగ్గిస్తూ వస్తోంది. తాజాగా 20 ఏళ్ల కనిష్ఠ స్థాయికి దించింది. రెపో కోతలకు అనుగుణంగా బ్యాంకుల రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు వేగంగా తగ్గుతున్నాయి. ఈ పరిణామం ఒకరికి మోదం.. మరొకరికి ఖేదంగా మారింది. గతంతో పోలిస్తే కారు చౌకగా రుణాలు లభిస్తుండటం రుణగ్రహీతలకు సంతోషకరమే. కానీ, పొదుపు ప్రయోజనాలకు గండికొడుతోంది. బ్యాంకుల్లో డబ్బుదాచుకునే వారికి రాబడి గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా, వడ్డీ ఆదాయంపైనే ఆధారపడే వయోవృద్ధులు అధికంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో మూడు బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. 


 • ఎఫ్‌డీ పథకాలపై అధిక వడ్డీ..
 • ఆఫర్‌ చేస్తోన్న 3 బ్యాంకులు  


సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనార్థం ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. వియ్‌ కేర్‌ పేరుతో తొలుత ఎస్‌బీఐ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత హెచ్‌డీఎ్‌ఫసీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌ పథకాలు విడుదలయ్యాయి. ఈ మూడు పథకాల వివరాలు.. 
 • ఎస్‌బీఐ వియ్‌ కేర్‌ 


ఈ నెల 12 నుంచి అందుబాటులోకి

కాలపరిమితి: ఐదేళ్లు

 1. 6.50 శాతం వార్షిక వడ్డీ (సాధారణ ఎఫ్‌డీలకు ఆఫర్‌ చేస్తున్న దానికంటే 0.80ు అధికం) 
 2. కాలపరిమితి తీరకముందే సొమ్ము విత్‌డ్రా చేసుకున్నట్లయితే, 0.30 శాతం అదనపు ప్రీమి యం లభించదు. అంతేకాదు, పెనాల్టీ కింద మరో  0.50 శాతం కోత పడుతుంది. 

గరిష్ఠ డిపాజిట్‌ పరిమితి: రూ.2 కోట్ల లోపు 


కామన్‌ ఫీచర్లు 

 1. 60 ఏళ్లు, ఆపై వయసు వారు ఈ పథకాలకు అర్హులు 
 2. కనీసం 5 ఏళ్లు, ఆపై కాలానికి డిపాజిట్లకు మాత్రమే
 3. కొత్త డిపాజిట్లతో పాటు ప్రస్తుత డిపాజిట్లకూ వర్తింపు 
 4. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు పథకం అమలు
 5. సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఇప్పటికే ఆఫర్‌ చేస్తోన్న వడ్డీకి అదనంగా చెల్లింపు 
 • హెచ్‌డీఎ్‌ఫసీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ 
 • ఈ నెల 18 నుంచి అందుబాటులోకి 
 • కాలపరిమితి: 5 ఏళ్ల 1 రోజు- 10 ఏళ్లు 
 • 6.50 శాతం వార్షిక వడ్డీ (సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే 0.75ు ఎక్కువ)
 • 5 ఏళ్లు, అంతకు ముందు సొమ్ము విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ. ఐదేళ్ల తర్వాత అయితే 1.25 శాతం పెనాల్టీ విధింపు
 • గరిష్ఠ డిపాజిట్‌ పరిమితి: రూ.5 కోట్ల లోపు 
 • ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌ 
 • ఈ నెల 20 నుంచి పథకం అందుబాటులోకి
 • కాలపరిమితి: 5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 
 • 6.55 శాతం వార్షిక వడ్డీ (సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే 0.80శాతం అధికం) 
 • 5 ఏళ్ల 1 రోజు కంటే ముందు డిపాజిట్‌ సొమ్మును ఉపసంహరించుకున్నట్లయితే 1 శాతం.. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే 1.30 శాతం పెనాల్టీ పడుతుంది. 
 • గరిష్ఠ డిపాజిట్‌ పరిమితి: రూ.2 కోట్ల లోపు 
పోస్టాఫీ‌స్‌లోనే అధిక వడ్డీ 

బ్యాంక్‌ ఎఫ్‌డీలతో పోల్చితే పోస్టాఫీ్‌సలో ఆఫర్‌ చేసే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అధిక వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు, ఐదేళ్ల పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌పై 6.7 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 7.4 శాతం వార్షిక వడ్డీ లభించనుంది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులైతే పోస్టాఫీస్‌ పథకాల కంటే అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. కాకపోతే రిస్క్‌ ఎక్కువ. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల ఎఫ్‌డీ వైపు మొగ్గు చూపే ముందు నష్టం భరించగలిగే సామర్థ్యం, పన్ను శ్లాబ్‌, లిక్విడిటీ వంటి అంశాలను బేరీజు వేసుకోవడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. 


ఆర్‌బీఐ టాక్సబుల్‌ బాండ్లు 

దీర్ఘకాలిక పొదుపునకు ఆర్‌బీఐ టాక్సబుల్‌ బాండ్లను కూడా ఎంచుకోవచ్చు. ఏడేళ్ల కాలపరిమితితో  కూడిన ఈ బాండ్లపై 7.75 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. పెట్టుబడులపై గరిష్ఠ పరిమితి లేదు. కాకపోతే, వీటి కొనుగోలుకు డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. 60 ఏళ్లలోపు వారికి కాలపరిమితికి ముందు పెట్టుబడి వాపసు తీసుకునే అవకాశం ఉండదు. 60-70 ఏళ్ల లోపు వారు 6 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఉపసంహరించుకోవచ్చు. 70-80 ఏళ్ల వారు 5 ఏళ్ల తర్వాత, 80 ఏళ్ల పైబడిన వారు 4 ఏళ్ల తర్వాత సొమ్ము వాపసు తీసుకునే వీలుంటుంది. పెట్టుబడులను ముందే ఉపసంహరించుకుంటే, అంతకుముందు ఆర్నెళ్లకు రావాల్సిన వడ్డీలో 50 శాతం కోతపడుతుంది. మరో ప్రతికూల అంశమేమిటంటే, ఈ బాండ్లు పన్ను పరిధిలోకి వస్తాయి. గరిష్ఠ పన్ను శ్లాబు పరిధిలోని వారికి మాత్రం అంతగా ప్రయోజనకరం కాదని విశ్లేషకులు అంటున్నారు. 


Updated Date - 2020-05-24T06:44:25+05:30 IST