ఎస్‌బీఐలో మరో విడత వీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2020-09-03T06:16:10+05:30 IST
ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనూ ఉద్యోగాలకు హామీ ఉండడం లేదు. ఖర్చుల తగ్గింపు కోసం వీఆర్‌ఎస్ పేరుతో ఎస్‌బీఐ సీనియర్ ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతోంది...

- 30,000 మంది ఉద్యోగులపై వేటు !
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనూ ఉద్యోగాలకు హామీ ఉండడం లేదు. ఖర్చుల తగ్గింపు కోసం వీఆర్‌ఎస్ పేరుతో ఎస్‌బీఐ సీనియర్ ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్-వీఆర్‌ఎస్,2020’ పేరుతో ప్రత్యేక వీఆర్‌ఎస్ ప్రకటించింది. పాతికేళ్ల సర్వీసు, 55 ఏళ్ల వయసు నిండిన ఉద్యోగులు ఈ పథకానికి అర్హులని పేర్కొంది.
రూ.2,170 కోట్లు ఆదా: ఈ సంవత్సరం మార్చి నాటికి ఎస్‌బీఐ పే రోల్స్‌లో ఉన్న 2.49 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 30,000 మంది ఈ పథకానికి అర్హులవుతారని అంచనా. వీరిలో 11,565 మంది అధికారులు. 18,625 మంది క్లరికల్ ఉద్యోగులు. వీరిలో 30 శాతం మంది వీఆర్‌ఎ్‌సను ఎంచుకున్నా జూలై, 2020 జీతాల ప్రకారం బ్యాంక్‌కు ఏటా రూ.2,170 కోట్లు ఆదా అవుతాయని అంచనా.
మూడు నెలల గడువు: వీఆర్‌ఎస్ తీసుకోవాలనుకునే ఉద్యోగులు ఏటా డిసెంబరు 1 నుంచి మరుసటి సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎంచుకోవచ్చు. గత ఏడాది ఎస్‌బీహెచ్‌తో సహా అయిదు అనుబం ధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి. దీంతో ఏర్పడిన మిగులు ఉద్యోగుల్లో సీనియర్లను వదిలించుకనేందుకు ఎస్‌బీఐ ఈ పథకం తీసుకొచ్చిందని భావిస్తున్నారు.
చెల్లింపు : వీఆర్‌ఎస్ పథకం ఎంచుకునే సీనియర్ ఉద్యోగులకు మిగిలిన సర్వీసు కాలం వరకు, 18 నెలలకు మించకుండా వారు తీసుకున్న ఆఖరు జీతంలో సగం చొప్పున చెల్లిస్తారు. దీంతో ఎంత మంది ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
అన్యాయం : ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడి కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాల్ని కేరియర్ చివరి దశలో అర్థాంతరంగా వదులుకోవద్దని అఖిల భారత ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం (ఏఐఎ్‌సఈఏ) ప్రధాన కార్యదర్శి కేఎస్ కృష్ణ కోరారు.
ఎస్‌బీఐ వీఆర్‌ఎస్ సరికాదు. నిజానికి ఇపుడు మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడి ఉద్యోగులు ఈ వల్లో చిక్కుకోవద్దు.
- సీహెచ్ వెంకటాచలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏఐబీఇఏ.