రిటైర్మెంట్‌ నిధులకూ రిస్క్‌

ABN , First Publish Date - 2020-05-10T07:12:20+05:30 IST

కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌ ఊగిసలాడుతోంది. పెట్టుబడుల విలువ రోజురోజుకు తరిగిపోతోంది. ఈ ప్రభావం అన్ని వయసుల వారి పెట్టుబడులపైనా కనిపిస్తోంది. ఇదే సమయంలో రిటైర్మెంట్‌ అనంతర ఖర్చుల...

రిటైర్మెంట్‌ నిధులకూ రిస్క్‌

కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌ ఊగిసలాడుతోంది. పెట్టుబడుల విలువ రోజురోజుకు తరిగిపోతోంది. ఈ ప్రభావం అన్ని వయసుల వారి పెట్టుబడులపైనా కనిపిస్తోంది. ఇదే సమయంలో రిటైర్మెంట్‌ అనంతర ఖర్చుల కోసం నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్న వారిలోనూ ఆందోళన ప్రారంభమైంది. అయితే, కోవిడ్‌-19 కష్టాల నుంచి ఎంతో కొంత గట్టెక్కేందుకు కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేమిటంటే..


లక్ష్యాల సమీక్ష: కొత్తగా ఉద్యోగంలో చేరి రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేస్తున్న వారయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మధ్య వయస్కులు లేదా రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వ్యక్తులైతే మాత్రం తమ లక్ష్యాలను సమీక్షించుకోక తప్పదు. ఇందుకోసం రిటైర్మెంట్‌ గడువు పొడిగించుకోవడమైనా చేయాలి లేదా పదవీ విరమణ తర్వాత అవసరమయ్యే మొత్తాన్నైనా తగ్గించుకోవాలి. 


ఖర్చులు తగ్గించుకోవడం: పెద్దగా నష్టభయం (రిస్కు) లేని పెట్టుబడులపై వడ్డీ రేటు తగ్గిపోతోంది. మున్ముందు పెరుగుతాయన్న నమ్మకమూ లేదు. కాబట్టి రిటైర్మెంట్‌ తర్వాత బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) లేదా చిన్న పొదుపు పథకాల్లో మదుపు చేసినా.. సీనియర్‌ సిటిజన్లకు పెద్దగా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా అప్పులు చెల్లించి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. 


పెట్టుబడి వ్యూహాల్లో మార్పులు: కరోనాకు ముందు అనుసరించిన పెట్టుబడి వ్యూహాలు.. వైరస్‌ నిష్క్రమణ తర్వా త పనిచేయకపోవచ్చు. రాబడుల (వడ్డీ)తో పాటు ఆదాయం తగ్గిపోవడం ఇందుకు కారణాలు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు రిటైర్మెంట్‌ తర్వాత మీ నైపుణ్యాలు, అభిరుచులతో కొత్త ఆదాయాల కోసం ప్రయత్నించడం ఒక మార్గం. 


పెట్టుబడుల వివిధీకరణ: అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదని సామెత. పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. రిటైర్మెంట్‌ పెట్టుబడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ఈక్విటీలో పెట్టుబడుల తగ్గించుకుంటూ పెద్దగా నష్ట భయం లేని ప్రభుత్వ లేదా బ్లూచిప్‌ కంపెనీల రుణ పత్రాలు లేదా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెంచుకుంటూ పోవాలి. అదే సమయంలో తప్పనిసరి ఖర్చులు, అప్పుల చెల్లింపులను దెబ్బతీయని రీతిలో పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికపుడు నష్టభయాన్ని అంచనా వేసుకుంటూ పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక దీర్ఘకాలిక రిటైర్మెంట్‌ లక్ష్యాలు సాధించేలా ఉండాలి. 


వేగంగా అప్పుల చెల్లింపు: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గించిన తర్వాత దాదాపు ప్రతి బ్యాంకు రిటైల్‌ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. రిటైల్‌ రుణాలు ఉన్న వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత వరకు ముందుగానే తమ రుణ బకాయిలు చెల్లించేయటం బెటర్‌. దీనివల్ల రుణ చెల్లింపు గడువు తగ్గడంతో పాటు వడ్డీల చెల్లింపు భారమూ తగ్గుతుంది. తప్పనిసరైతే తప్ప మూడు నెలల మారిటోరియాన్ని ఉపయోగించుకోవద్దు. ఇంకా చేతిలో దండిగా మిగులు నిధులు ఉంటే ఒకేసారి రిటైల్‌ లోన్‌ మొత్తం తీర్చేస్తే ఇంకా మంచిది. 


Updated Date - 2020-05-10T07:12:20+05:30 IST