కరోనా పోరులో 6 లక్షల మంది రిలయన్స్ సిబ్బంది.. రూ. 5 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-03-24T00:08:23+05:30 IST

కరోనా వైరస్ నియంత్రణలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ

కరోనా పోరులో 6 లక్షల మంది రిలయన్స్ సిబ్బంది.. రూ. 5 కోట్ల విరాళం

ముంబై: కరోనా వైరస్ నియంత్రణలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న హెల్త్ వర్కర్ల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలైన సూట్లు, వస్త్రాలతో పాటు రోజుకు లక్షల ఫేస్ మాస్క్‌లను ఉత్పత్తి చేసేలా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అలాగే, బహుళస్థాయిలో నివారణ, ఉపశమనం కోసం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించినట్టు పేర్కొంది.


రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ రిటైల్, జియో, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫ్యామిలీలోని మొత్తం 6,00,000 మంది సభ్యుల సమగ్ర బలాన్ని కరోనా వైరస్‌పై పోరు కోసం ఉపయోగించుకుంటున్నట్టు వివరించింది. అలాగే, సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సహకారంతో కోవిడ్-19 పాజిటివ్ రోగుల కోసం ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 100 పడకల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్జీవోలతో కలిసి వివిధ నగరాల్లోని ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తోంది. మహారాష్ట్రలోని లోధివాలిలో పూర్తిస్థాయి ఐసోలేషన్ కేంద్రాన్ని నిర్మించి జిల్లా అధికారులకు అప్పగించింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ సమర్థవంతమైన అదనపు పరీక్ష కిట్‌లు దిగమతి చేసుకుంటోందని, ఈ ప్రాణాంతక వైరస్‌ను నివారించేందుకు తమ వైద్యులు, పరిశోధకులు అదనపు సమయం పనిచేస్తున్నారని ఆర్ఐల్ వివరించింది. 

Updated Date - 2020-03-24T00:08:23+05:30 IST