ఏఐ, ఆటోమేషన్‌తో ‘ఆరోగ్య సంరక్షణ’లో కొత్త ఒరవడి
ABN , First Publish Date - 2020-09-02T06:11:44+05:30 IST
దేశంలో వైద్య సేవల రంగం సజావుగా మార్పు చెందడానికి కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలు కీలక ప్రభావం చూపనున్నాయని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు...
- అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వైద్య సేవలు అందించే విధానంలో సమూల మార్పులు రావాల్సి ఉం దని.. దేశంలో వైద్య సేవల రంగం సజావుగా మార్పు చెందడానికి కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలు కీలక ప్రభావం చూపనున్నాయని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని.. పొరుగు దేశాలతో పోల్చినా నిధుల కేటాయింపులో మనం వెనుకబడి ఉన్నామని ‘ఆసుపత్రికి దూరంగా చికిత్స, ఆరోగ్య సంరక్షణ రంగ భవిష్యత్తు’పై ఫిక్కీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. ఆర్యోగ సంరక్షణ రంగానికి నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. అలానే డాక్టర్లను రెట్టింపు చేయాలి. నర్సులను మూడింతలు చేయాలి. పారామెడికల్ సిబ్బందిని నాలుగింతలకు పెంచాలన్నారు. ప్రపంచానికి మనం డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని అందించగలమని.. నిరంతరం ఉద్యోగావకాశాలను కల్పించగల సామర్థ్యం ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉందన్నారు. శిక్షణ సదుపాయాలు, కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయని వీటిని పెంచాలని కోరారు. ప్రపంచానికి కొన్ని వందల మంది డాక్టర్లు. నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కావాలి. శిక్షణ ద్వారానే వారిని అందించగలమని చెప్పారు. కొవిడ్ విస్తరించకుండా ప్రభుత్వం అనేక చర్యలు తగిన సమయంలో తీసుకుంది. కొవిడ్ రోగులకు చికిత్స చేయడానికి ఇంటెన్సివ్ కేర్ సదుపాయాలు ఉండాలన్నారు.