భవిష్యత్తులో రిలయన్స్ వ్యాపారాల విభజన?
ABN , First Publish Date - 2020-06-25T06:22:14+05:30 IST
రికార్డు స్థాయి నిధుల సేకరణతో రుణరహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. వాటాదారుల పెట్టుబడుల విలువను మరింత పెంచడంపై దృష్టిసారించనుందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తాజా నివేదిక అభిప్రాయపడింది...

న్యూఢిల్లీ: రికార్డు స్థాయి నిధుల సేకరణతో రుణరహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. వాటాదారుల పెట్టుబడుల విలువను మరింత పెంచడంపై దృష్టిసారించనుందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తాజా నివేదిక అభిప్రాయపడింది. ఇందుకోసం వచ్చే 3-4 ఏళ్లలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ విభాగాలు పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రావచ్చని అంటోంది. ఐపీఓల ద్వారా రిలయన్స్ వ్యాపారాలను విభజించవచ్చని బెర్న్‌స్టీన్ రిపోర్టు అభిప్రాయపడింది. రిలయన్స్ డిజిటల్ సేవల అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదా పు 25 శాతం వాటా విక్రయం ద్వారా కేవ లం రెండు నెలల్లో రూ.1.15 లక్షల కోట్లు సేకరించింది. భారత్‌లో అతిపెద్ద రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ.53,124 కోట్లు సమీకరించింది.
త్వరలో సౌదీ అరామ్కోతో డీల్!
చమురు, పెట్రోకెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటా విక్రయానికి ప్రపంచ ఆయిల్ దిగ్గజం సౌదీ అరామ్కోతో చర్చలు జరుపుతున్నట్లు గత ఏడాది రిలయన్స్ ప్రకటించింది. వాస్తవానికి ఈ మార్చి చివరినాటికి ఈ డీల్ పూర్తికావాల్సింది. జియోలో వాటాల విక్రయం పూర్తి చేసిన ముకేశ్ అంబానీ.. ఇక అరామ్కోతో డీల్‌పై దృష్టిసారించారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని సమాచారం.