ఫండ్స్‌కు అండ
ABN , First Publish Date - 2020-04-28T05:43:56+05:30 IST
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్లలో ఆందోళనలను తగ్గించేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50,000 కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయాన్ని...

- రూ.50,000 కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ
- ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ షాక్ నేపథ్యంలోనే..!
ముంబై: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్లలో ఆందోళనలను తగ్గించేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50,000 కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఏకంగా 6 డెట్ (రుణ) పథకాలను రద్దు చేస్తున్నట్లు గతవారం ప్రకటించింది. కరోనా సంక్షోభంతో క్యాపిటల్ మార్కెట్లో ఆటుపోట్లు అధికమైన నేపథ్యంలో ఈ పరిణామం ఫండ్ మదుపర్లలో ఆందోళనలను మరింత పెంచింది. ‘‘క్యాపిటల్ మార్కెట్లో పెరిగిన ఒడుదొడుకుల కారణంగా ఫండ్ సంస్థలకు ద్రవ్య కొరత ఏర్పడింది. కొన్ని ఎంఎఫ్ పథకాల మూసివేత, ఇతర పథకాలపైనా దాని ప్రభావంతో ఈ కంపెనీలకు ద్రవ్య కొరత తీవ్రతరమైంది. అయితే, అధిక రిస్క్‌తో కూడిన డెట్ పథకాల్లోనే ఈ ఒత్తిడి నెలకొంది. మిగతా పథకాలకు ఎలాంటి ద్రవ్య కొరత లేదు. ఈ నేపథ్యంలో ఫండ్ల ద్రవ్య అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక ద్రవ్య వసతిని ఏర్పాటు చేస్తున్న’’ట్లు సోమవారం నాటి ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు ఆర్థిక స్థిరీకరణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ పునరుద్ఘాటించింది.
ఏంటీ ఫండ్..?
స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ (ఎ్‌సఎల్‌ఎ్‌ఫ-ఎంఎ్‌ఫ)లో భాగంగా బ్యాంకుల కోసం ఆర్‌బీఐ 90 రోజుల కాలపరిమితితో కూడిన రెపో ఆపరేషన్స్‌ను నిర్వహించనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బిడ్లు సమర్పించవచ్చు. బిడ్ కనీసం మొత్తం రూ.కోటి. ఈ రెపో ఆపరేషన్స్ ద్వారా సేకరించిన నిధులతో బ్యాంకులు మ్యూచువల్ ఫండ్లకు రుణాలు ఇవ్వవచ్చు. లేదా ఫండ్ల వద్దనున్న కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికెట్లను కొనుగోలు చేయవచ్చు.
కాలపరిమితి
ఈ నెల 27 (సోమవారం) నుంచి మే 11 వరకు లేదా కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగించుకునే వరకు (ఏది ముందైతే అది) ఈ ద్రవ్య వసతి అందుబాటులో ఉంటుంది.
మంచి నిర్ణయం: విశ్లేషకులు
మ్యూచువల్ ఫండ్ల కోసం ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయాన్ని విశ్లేషకులు స్వాగతించారు. ఒత్తిడిలోనున్న ఎంఎఫ్‌ల కోసం రూ.50 వేల కోట్ల ప్రత్యేక వసతిని ప్రకటించడం చాలా మంచి నిర్ణయమన్నారు. ఇది ఫండ్ పథకాలపై మదుపర్లలో విశ్వాసాన్ని మెరుగుపర్చడంతో పాటు కార్పొరేట్ డెట్ మార్కెట్లో ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడనుందని వారు అభిప్రాయపడ్డారు.
గతంలోనూ..
2013 జూలై
మ్యూచువల్ ఫండ్ల నగదు అవసరాలకు తోడ్పడేందుకు వీలుగా బ్యాంకులకు రూ.25,000 కోట్ల ప్రత్యేక రుణ సేకరణ వసతిని ప్రకటించింది.
2008 అక్టోబరు
అమెరికా ఆర్థిక దిగ్గజం లేమన్ బ్రదర్స్ కుప్పకూలిన తరుణంలోనూ ఫండ్ల కోసం అదనపు ద్రవ్య వసతిని ఏర్పాటు చేసింది.