గృహోపకరణాలు..అమ్మో ప్రియం
ABN , First Publish Date - 2020-12-28T06:24:30+05:30 IST
నూతన సంవత్సరం గృహ వినియోగదారులకు ఒక చేదు కబురు మోసుకొస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి కీలకమైన గృహోపకరణాల ధరలు జనవరి నుంచి 10 శాతం మేరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి...

- జనవరి నుంచి ధరలు 10 శాతం పెరిగే చాన్స్
- ముడిసరుకు ధరల పెరగుదలే కారణం
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం గృహ వినియోగదారులకు ఒక చేదు కబురు మోసుకొస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి కీలకమైన గృహోపకరణాల ధరలు జనవరి నుంచి 10 శాతం మేరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే రాగి, అల్యూమినియం. స్టీల్ వంటి లోహాల ధరలతో పాటు సముద్ర, విమాన రవాణా చార్జీలు పెరగడమే ధరల పెంపునకు కారణంగా ఉండనుందని తయారీదారులు అంటున్నారు. అంతర్జాతీయ వెండార్లు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాలు చేయలేకపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల ధరలు రెండు రెట్లు పెరిగాయి. అలాగే క్రూడాయిల్ ధరలు పెరగడంతో ప్లాస్టిక్ ధరలు కూడా పెరిగాయని వారు పేర్కొన్నారు. ముడిసరుకు ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో గృహోపకరణాల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎల్‌జీ, పానాసోనిక్, థామ్సన్ ప్రతినిధులన్నారు. సోనీ మాత్రం పరిస్థితిని ఇంకా సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా టీవీ ఓపెన్ సెల్ ధరలు 200 శాతం మేరకు పెరిగినట్టు థామ్సన్ బ్రాండ్ లైసెన్సీ అయిన సూపర్ ప్లాస్ట్రానిక్స్, కోడక్ చెబుతున్నాయి. కాగా విమానాల్లో సరుకు దిగుమతి చార్జీలు ఈ ఏడాది అక్టోబరుతో పోల్చితే ఇప్పటికి మూడు రెట్లు పెరిగాయని వీడియో టెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు.
డిమాండ్ తగ్గుతుంది...జాగ్రత్త
గృహోపకరణాల ధరలు పెంచినట్టయితే వచ్చే త్రైమాసికంలో వీటికి డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయని వినియోగదారుల ఎలక్ర్టానిక్స్, అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సియామా) హెచ్చరించింది. సముద్ర, వైమానిక రవాణా చార్జీలు ఐదారు రెట్లు పెరగడంతో కమోడిటీ ధరలు 20-25 శాతం పెరిగాయని, అలాగే కరోనా కల్లోలం కారణంగా గనుల తవ్వకం కార్యకలాపాలు కూడా భారీగా పడిపోవడం ఈ ఒత్తిడిని మరింతగా పెంచిందని చెబుతూ అందుకోసం ధరలు పెంచితే మాత్రం కొనుగోళ్ల డిమాండ్ తగ్గొచ్చని సియామా ప్రెసిడెంట్, గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు. ప్రస్తుతం స్తబ్ధంగా ఉన్న డిమాండ్‌ను పెంచుకోగలిగితే ఈ ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గించుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ధరల ఒత్తిడి ఎంతో కాలం ఉండదని, వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం గృహోపకరణాల మార్కెట్ పరిమాణం రూ.76,400 కోట్లుగా ఉండగా అందులో దేశీయ తయారీ రంగం వాటా రూ.32,200 కోట్లుగా ఉంది.
కమోడిటీ ధరలు పెరగడంతో జనవరి నుంచి గృహోపకరణాల ధరలు 6-7 శాతం మధ్యన పెరిగి జనవరి నాటికి పెరుగుదల రేటు 10-11 శాతానికి చేరవచ్చు.
- మనీష్ శర్మ, సీఈఓ, పానాసోనిక్ ఇండియా
రోజురోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్న సరఫరా ల వ్యవస్థ పరిస్థితి ఎలా ఉండబోతోందో కొంత కాలం పాటు వేచి చూడాలని మేం భావిస్తున్నాం. ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందా అనే విషయం కూడా గమనిస్తు న్నాం. ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతున్నందు వల్ల ఫ్యాక్టరీలు పూర్తి స్థాయి సామర్థ్యాలతో పని చేయలేకపోవడమే ధరల పెరుగుదలకు కారణం.
- సునీల్ నయ్యర్, ఎండీ, సోనీ ఇండియా