ఫార్మాపై కోవిడ్‌ ప్రభావం అంతంతే

ABN , First Publish Date - 2020-06-11T08:05:51+05:30 IST

ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాలు కోవిడ్‌-19తో వణికిపోతున్నాయి. కొన్ని రంగాలైతే ఇప్పట్లో తేరుకునే సూచనలూ కనిపించడం లేదు. ఔషధ రంగం(ఫార్మా)పై మాత్రం ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేదు...

ఫార్మాపై కోవిడ్‌ ప్రభావం అంతంతే

  • అయినా ధరల పెంపు తప్పదు
  • ఇండియా రేటింగ్స్‌

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాలు కోవిడ్‌-19తో వణికిపోతున్నాయి. కొన్ని రంగాలైతే ఇప్పట్లో తేరుకునే సూచనలూ కనిపించడం లేదు. ఔషధ రంగం(ఫార్మా)పై మాత్రం ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేదు. దీంతో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో మూడు నుంచి ఐదు శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అంచనా. ఏటా పెరిగినట్టే ఈ సంవత్సరం జూన్‌ నుంచి ఫార్మా కంపెనీల నెలవారీ ఆదాయాలూ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పెరుగుతున్న కోవిడ్‌ కేసులతో సంక్రమిస్తున్న ఇతర అనారోగ్య సమస్యలూ ఇందుకు దోహదం చేస్తాయని ఇండియా రేటింగ్స్‌ అంచనా.


అధికంగానే వడ్డింపు

ఫార్మా కంపెనీలు ఔషధ ధరల నియంత్రణ చట్టం (డీపీసీఓ) పరిధిలో లేని ఔషధాల ధరలను ఏటా పది శాతం వరకు పెంచుకోవచ్చు. దీంతో ఈ కంపెనీలు ఏటా ఈ ఔషధాల ధరలను సగటున అయిదు శాతం వరకు పెంచుతుంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం కంపెనీలు ఈ ధరలను ఎనిమిది శాతం వరకు పెంచే అవకాశం ఉందని అంచనా. కోవిడ్‌-19తో ప్రధాన ముడి పదార్ధాల ధరలు, రవాణా, ఇతర ఖర్చులు పెరిగి పోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది. 


‘ఆర్థిక’ కష్టాలు లేవు

ఫార్మా కంపెనీల ఆర్థిక పరిస్థితులపైనా ఇండియా రేటింగ్స్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇతర రంగాలతో పోలిస్తే ఫార్మా రంగంలోని ప్రముఖ కంపెనీల ఆస్తి, అప్పుల పట్టిక, నగదు నిల్వలు పటిష్ఠంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఒకవేళ అదనపు నిధులు అవసరమైనా, ఈ కంపెనీలు పెద్ద ఇబ్బందులు లేకుండానే అవసరమైన స్థాయిలో నిధులు సమీకరించగలవని అంచనా వేసింది. 


పడి లేచింది

లాక్‌డౌన్‌ ప్రభావం మొదట్లో ఫార్మా కంపెనీలపైనా కనిపించింది. ఏప్రిల్‌లో ఈ రంగంలోనూ ఉత్పత్తి 50 నుంచి 60 శాతం పడిపోయింది. అయితే అత్యవసర సేవలుగా గుర్తించి, ఆంక్షలు తొలగించడంతో మే నుంచి క్రమంగా కోలుకుంది. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు తమ స్థాపిత సామర్ధ్యంలో 60 నుంచి 80 శాతం వరకు ఉపయోగించుకునే స్థాయికి చేరినట్టు తెలిపింది. 


Updated Date - 2020-06-11T08:05:51+05:30 IST