రూ.40,000 కోట్ల ఔషధాల తయారీ!

ABN , First Publish Date - 2020-07-22T06:15:18+05:30 IST

ముడి ఔషధాలు, కీలక మూలకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది...

రూ.40,000 కోట్ల ఔషధాల తయారీ!

  • ఫార్మా పార్కులపై త్వరలో మార్గదర్శకాలు
  • పోటీలో తెలంగాణ, ఏపీ, పంజాబ్‌ 
  • ఔషధాన్ని బట్టి ప్రోత్సాహకాలు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ముడి ఔషధాలు, కీలక మూలకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఔషధాల తయారీలో వినియోగించే యాక్టివ్‌ ఫార్మాసుటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), కీలక మూలకాలు (కేఎ్‌సఎం), ఇంటర్మీడియెట్ల తయారీని పెంచేందుకు దేశవ్యాప్తంగా 3 మెగా ముడి ఔషధ పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. మెగా ఔషధ పార్కుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్రాలను ఎంపిక చేయడానికి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు ఈ పార్కులను అభివృద్ధి చేస్తే.. వాటికి కేంద్రం రూ.1,000 కోట్ల చొప్పున సాయం చేయనుంది. ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ పార్కుల్లో యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా అభివృద్ధి చేస్తారు. అలాగే సాల్వెంట్‌ రికవరీ ప్లాంటు, డిస్టిలేషన్‌ ప్లాంట్‌, పవర్‌, యూనిట్లు, ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.  ఈ పార్కులు అందుబాటులోకి వస్తే దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఏపీఐలు, కీలక ఔషధాలు ఉత్పత్తి కాగలవని భావిస్తున్నారు. దీనివల్ల ముడి ఔషధాలకు చైనాపై ఆధారపడడం తగ్గడమే కాకుండా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 


కొన్నింటికి 20 శాతం..

ఏపీఐల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం కింద వచ్చే ఎనిమిదేళ్లలో కీలకమైన 53 ఏపీఐలు, ఇంటర్మీడియెట్లు, కీలక మూలకాల తయారీకి దాదాపు రూ.7,000 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వనున్నారు. ఈ స్కీమ్‌ కింద ఎరిథ్రోమైసిన్‌ వంటి ఫెర్మింటేషన్‌ ఆధారిత బల్క్‌ డ్రగ్స్‌పై ప్రతి ఏడాది పెరిగే ఉత్పత్తి ఆధారంగా  20 శాతం ప్రోత్సాహకాలు, పారాసిటమాల్‌ వంటి కెమికల్‌ సింథసిస్‌ ఔషధాలపై 10 శాతం ప్రోత్సాహాకాలు ఇస్తారు.


దిగుమతులపై సుంకాల పెంపు!

దీంతోపాటు ముడి ఔషధాల దిగుమతులు తగ్గించడానికి, దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఏపీఐ దిగుమతులపై సుంకాలను పెంచే అంశాన్ని కూడా ప్రభు త్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నట్లు చెబుతున్నారు. దిగుమతులపై సుంకాలు పెంచితే కంపెనీలపై ప్రభావం ఎంత? దిగుమతులు తగ్గితే ఎదురయ్యే పరిస్థితులు ఏమిటీ? ఫార్ములేషన్ల తయారీలో తలెత్తే ఇబ్బందులు మొదలైన వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏపీఐలపై ప్రస్తుతం దాదాపు 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు.

 ఎరిథ్రోమైసిన్‌ వంటి వాటికి దేశీయ కంపెనీలు పూర్తిగా చైనాపై ఆధారపడి ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. దేశీయంగా ఏపీఐలను తయారు చేసే సామ ర్థ్యం మన కంపెనీలకు ఉన్నప్పటికీ.. తక్కువ ధర దిగుమతులతో పోటీ పడే పరిస్థితులు లేవని యూరోమెడికేర్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజమౌళి తెలిపారు. 


కనీసం 3-4 ఏళ్లు..

మెగా ఔషధ పార్కుల పనులు ఇప్పటికిప్పుడు ప్రారం భించినా అవి అందుబాటులోకి వచ్చి ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం 3-4 ఏళ్లు పడుతుందని రాజమౌళి అన్నారు. ఒక ఔషధ యూనిట్‌ను ప్రారంభించాలంటే ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఔషధ రంగంలో ఎక్కువ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ అనుమతులు రావడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. 

చైనాలో పర్యావరణ అనుమతులు, యూనిట్‌ ఏర్పాటు చేసిన తర్వాత పర్యావరణపరంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. దాదాపు 90 శాతం ముడి ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నందున ఇప్పటికిప్పుడు వెంటనే దిగుమతులను తగ్గించడానికి ఎటువంటి చర్యలు చేపట్టినా అది దేశీయ పరిశ్రమపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. క్రమేపీ దిగుమతులను తగ్గించడమే సరైన వ్యూహమన్నారు. 

Updated Date - 2020-07-22T06:15:18+05:30 IST