గూగుల్ సునామీని నిలువరించండి: పేటీఎం వ్యవస్థాపకుడి పిలుపు
ABN , First Publish Date - 2020-10-04T01:24:42+05:30 IST
గూగుల్ వ్యవహారశైలితో భారత టెక్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు గూగుల్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ప్లే స్టోర్ నుంచి పేటీంఎం యాప్ తొలగించడంతో ఈ వివాదానికి బీజం పడినట్టు తెలుస్తోంది. ప్రజలకు యాప్‌లు అందుబాటులోకి ఉండాలంటే గూగుల్ ప్లే స్టోర్ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంలో గూగుల్ హవా నడుస్తోంది. అన్ని స్మార్ట్ ఫోన్లు యాండ్రాయడ్ ఓఎస్ ఆధారంగా నడుస్తుండటమే ఇందుకు కారణం.
న్యూఢిల్లీ: గూగుల్ వ్యవహారశైలితో భారత టెక్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు గూగుల్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగించడంతో ఈ వివాదానికి బీజం పడినట్టు తెలుస్తోంది. ప్రజలకు యాప్‌లు అందుబాటులోకి ఉండాలంటే గూగుల్ ప్లే స్టోర్ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంలో గూగుల్ హవా నడుస్తోంది. అధిక శాతం స్మార్ట్ ఫోన్లు యాండ్రాయడ్ ఓఎస్ ఆధారంగా నడుస్తుండటమే ఇందుకు కారణం.
అయితే గూగుల్ ఆధిపత్యంపై భారత్ టెక్ కంపెనీలు.. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. గూగుల్ సవాలుకు దీటుగా స్పందించేందుకు ఆయా సంస్థలన్నీ జట్టు కడుతున్నాయని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. యాప్‌ల విషయంలో గూగుల్ అనుసరిస్తున్న విధానాలు అన్యాయమని ఈ సంస్థలు భావిస్తున్నాయట. ఈ విషయంలో భవిష్యత్తులో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తప్పదనేందుకు సూచనగా స్టార్టప్ కంపెనీ యాజమాన్యాలు ఇప్పటికే రెండు వీడియో కాన్ఫరెన్సులు పెట్టుకున్నట్టు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఆయా కాన్ఫరెన్సుల్లో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్‌ల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది.
‘త్వరలో యుద్ధం జరుగుతుంది. గూగుల్ ఓడిపోతుంది’ అని ఇండియా మార్ట్ సీఈఓ దినేశ్ అగర్వాల్ వ్యాఖ్యానించారట. గత నెలలో గూగుల్ అకస్మాత్తుగా ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగించడంతో వివాదం రాజుకుంది. ప్లేస్టోర్ నిబంధనలను పేటీఎం అతి క్రమించినందుకే ఇలా చేయాల్సి వచ్చిందని గూగుల్ అప్పట్లో వివరణ ఇచ్చింది. కాగా.. ఈ అంశంపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంగళవారం నాడు సీరియస్ గానే స్పందించారని సమచారం. ‘ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ..గూగుల్ ఓ ‘బిగ్ డాడీ’లా వ్యవహరిస్తోంది. యాప్‌లకు ఆక్సిజన్ లాంటి పంపిణీ వ్యవస్థను నియంత్రిస్తోంది. ఈ సునామీని అడ్డుకునేందుకు మనందరం చేతులుకలపాలి. మన భవిష్యత్తు మన నియంత్రణలోనే ఉండాలి’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారట.