ప్రభుత్వ పథకాలన్నీ ఇక పేటీఎం‌లో.. ప్రకటించిన సంస్థ

ABN , First Publish Date - 2020-04-22T00:32:01+05:30 IST

భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ బ్యాంకు అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) తన వ్యాపార ప్రయాణంలో...

ప్రభుత్వ పథకాలన్నీ ఇక పేటీఎం‌లో.. ప్రకటించిన సంస్థ

హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ బ్యాంకు అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) తన వ్యాపార ప్రయాణంలో ఓ కొత్త మైలురాయిని చేరుకుంది.  ఇప్పటివరకు ఈ బ్యాంకుకు 57 మిలియన్లకు పైగా పొదుపు ఖాతాదారులున్నారు. వీరంతా తమ ఖాతాల్లో చేసిన డిపాజిట్ల విలువ ఈరోజు 1000 కోట్లు దాటింది. ఈ మేరకు పేటీఎం ప్రకటించింది. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమేంట్లపై ఆధారపడుతున్నారని, దీనివల్ల తమ బ్యాంకులో డిపాజిట్లు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొంది.


ఇకనుంచి తమ కస్టమర్లు 400కు పైగా ప్రభుత్వ రాయితీల ప్రయోజనాలను కూడా తమ బ్యాంకు లోని పొదుపు ఖాతాదారులకు అందించనున్నట్లు పీపీబీఎల్ తెలిపింది. ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చెల్లింపులు, వృద్ధాప్య పెన్షన్, స్కాలర్‌షిప్‌ల వంటి వివిధ సాంఘిక సంక్షేమ పథకాల సబ్సిడీలను నేరుగా ఖాతాదారులకు బదిలీ చేసేందుకు గానూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (డీబీటీ) ని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.


ఈ సందర్భంగా పీపీబీఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, "మా వినియోగదారులకు సులభమైన, అనుకూలమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం. అంతేకాకుండా మంది వినియోగదారులకు వినియోగదారులకు ప్రత్యక్ష సబ్సిడీ బదిలీలను అందిస్తున్నాం. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల ప్రజలకు అన్ని రకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామ’ని తెలిపారు.


డీబీటీని ఎంచుకోవడం ఎలా..?

పేటీఎం అప్లికేషన్ ద్వారా డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) దరఖాస్తును నమోదు చేసి ఎంచుకోవచ్చు. అవసరమైన వివరాలు సమర్పించిన తర్వాత, అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. సబ్సిడీలను స్వీకరించడానికి ఖాతా లింకింగ్ కోసం ఎటువంటి ఛార్జీలు లేవు. వినియోగదారులు వారి బ్యాంకింగ్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు.

Updated Date - 2020-04-22T00:32:01+05:30 IST