ఉల్లి ధరలు తగ్గుతున్నాయోచ్...
ABN , First Publish Date - 2020-12-29T20:23:39+05:30 IST
కొత్త సంవత్సరంలో ఉల్లి ధరలు తగ్గబోతున్నాయి. ఉల్లి ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు శుభవార్త చెప్పింది. కొద్ది నెలల క్రితం సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి రైతులు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో ఉల్లి ధరలు తగ్గబోతున్నాయి. ఉల్లి ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు శుభవార్త చెప్పింది. కొద్ది నెలల క్రితం సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి రైతులు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సరఫరాలో కూడా ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకున్నాయి.ఈ నేపధ్యంలో... ఉల్లి ధరలు రూ. 200 మార్కును కూడా చేరుకున్నాయి. కేంద్రం వెంటనే చర్యలు చేపట్టి, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంది. దీంతో ఉల్లి ధరలు క్రమంగా దిగి వచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ. 25-35 మధ్య ఉంది.
కాగా... ఈ దఫా పంట రావడం, దిగుమతులు ఉండటంతో ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెంుడు రోజుల్లో రానున్న కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుండి ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జారీ అయింది. జనవరి ఒకటి నుండి అన్ని రకాల ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
ఉల్లి ధరలను అదుపు చేసేందుకు విదేశాలకు ఉల్లి విత్తనాల ఎగుమతిని తక్షణమే నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సెప్టెంబరు 15 న ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు... హోల్‌సేలర్ల వద్ద 25 టన్నులు, రిటైలర్ల వద్ద 2 టన్నులకు మించి ఉల్లి నిల్వలుండరాదని ఇది వరకే కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఎగుమతికి పచ్చజెండా...
కొత్త ఏడాదిలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చునని కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్-జులై కాలంలో ఉల్లి ఎగుమతులు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత వర్షాలు, వరదల నేపధ్యంలో పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో ధరలు పెరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం... 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి 328 మిలియన్ డాలర్ల విలువైన తాజా ఉల్లి, 112 మిలియన్ డాలర్ల విలువైన దెబ్బతిన్న ఉల్లి ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-జులై కాలంలో బంగ్లాదేశ్‌కే ఎగుమతులు 157.7 శాతం మేర పెరిగాయి.