మొబైల్స్‌ మరింత ప్రియం!

ABN , First Publish Date - 2020-10-03T06:55:37+05:30 IST

మొబైల్‌ ఫోన్ల ధరలు 3 శాతం వరకు పెరగవచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపింది...

మొబైల్స్‌ మరింత ప్రియం!

  • 3 శాతం వరకు పెరగనున్న ధర 
  • ఫోన్‌ డిస్‌ప్లే దిగుమతులపై సుంకం విధింపే కారణం..
  • వెల్లడించిన ఐసీఈఏ 


న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్ల ధరలు 3 శాతం వరకు పెరగవచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపింది. ఫోన్‌ డిస్‌ప్లే దిగుమతులపై 10 శాతం సుంకం విధింపే ఇందుకు కారణం. పరిశ్రమ వర్గాల సమ్మతితో 2016లో ప్రకటించిన ఫేజ్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రోగ్రామ్‌ (పీఎంపీ)లో భాగంగా ఫోన్‌ డిస్‌ప్లే అసెంబ్లీ, టచ్‌ ప్యానెళ్ల దిగుమతిపై సుంకం విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2020 అక్టోబరు 1 నుంచి నుంచి అమల్లోకి వచ్చిన ఈ సుంకం కారణంగా మొబైల్‌ ఫోన్ల ధరలు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు పెరగవచ్చని ఐసీఈఏ జాతీయ చైర్మన్‌ పంకజ్‌ మొహీంద్రూ అన్నారు. యాపిల్‌, హువే, షామీ, వివో, విన్‌స్ట్రాన్‌ తదితర సంస్థలు ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నాయి. దేశీయంగా ఎలకా్ట్రనిక్‌ విడిభాగాల ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతులను క్రమంగా తగ్గించుకోవడమే పీఎంపీ ప్రధాన ఉద్దేశం. కరోనా సంక్షోభం, జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) గతంలో విధించిన నిషేధం కారణంగా ఫోన్ల డిస్‌ప్లే అసెంబ్లీ ఉత్పత్తిని లక్ష్యం మేరకు పెంచుకోలేకపోయామని మొహీంద్రూ తెలిపారు. దేశీయంగా వీటి ఉత్పత్తిని పెంచే విషయంలో పరిశ్రమ కట్టుబడి ఉందన్నారు. ట్విన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్‌ పేరుతో దేశంలో తొలి ఎల్‌సీడీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రమోటింగ్‌ కంపెనీ వోల్కాన్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ 2016లో ప్రతిపాదన చేసింది. రూ.68,000 కోట్ల భారీ పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేయాలన్నది సంస్థ ప్రతిపాదన. ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు.

Updated Date - 2020-10-03T06:55:37+05:30 IST