రక్షణ రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
ABN , First Publish Date - 2020-06-16T06:09:31+05:30 IST
మౌలిక సదుపాయాల రంగంలోని మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) రక్షణ రంగంలోకి అడుగుపెడుతోంది...

- రూ.500 కోట్లతో తయారీ యూనిట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మౌలిక సదుపాయాల రంగంలోని మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) రక్షణ రంగంలోకి అడుగుపెడుతోంది. రూ.500 కోట్లతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రక్షణ పరికరాలు, ఆయుధాలు తయారు చేసేందుకు కేంద్ర హోం, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి అనుమతి పొందింది. మౌలిక సదుపాయాల రంగంలోని మేఘా గ్రూప్ ఇప్పటికే చమురు, విద్యుత్, సౌర విద్యుత్, విమానయాన రంగాల్లోకి అడుగు పెట్టింది. తాజాగా రక్షణ రంగంలోకి ప్రవేశించిందని మేఘా ఇంజినీరింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు.
ఎంఈఐఎల్ యూనిట్‌లో యు ద్ధ ట్యాంకులు, వాటి విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మ్‌డ్ ఇంజనీరింగ్ వెహికల్స్, ఆర్మ్‌డ్ రికవరీ వెహికల్స్ మొదలైనవి తయారు చేస్తారు. సైనికులను తీసుకువెళ్లే సాయుధ బహుళ వినియోగ వాహనాలు, అన్ని ప్రాంతాల్లో నూ తిరిగే తేలికపాటి యుద్ధ వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తామని శ్రీనివాస్ వివరించారు. క్షిపణులు, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, మిషన్ గన్స్ తదితరాలకు అవసరమైన పరికరాలను కూడా తయారు చేస్తారు.
మేఘా గ్రూప్‌నకు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ఐకామ్ టెలి ఇప్పటికే రక్షణ వ్యవస్థకు చెందిన వివిధ విభాగాలకు శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహాయ, సహకారాలు అందిస్తోంది. ఐకామ్ డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్‌తోపాటు విద్యుత్ ప్రసార పంపిణీ, సౌర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియా విధానంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ పరికరాల ఉత్పత్తికి అనుమతి కోరుతూ గతంలో ఎంఈఐఎల్ దరఖాస్తు చేసింది.