హైదరాబాద్‌లో మహీంద్రా వేర్‌హౌస్ సామర్థ్యం పెంపు... కరోనా వ్యాక్సీన్ నిల్వలకు కూడా

ABN , First Publish Date - 2020-11-06T21:18:35+05:30 IST

హైదరాబాద్‌లో మహీంద్రా వేర్‌హౌస్ సామర్థ్యం పెంపు... కరోనా వ్యాక్సీన్ నిల్వలకు కూడా ఈ-కామర్స్, వాహన సంస్థలు, ఫార్మారంగాలకు చెందిన సంస్థలకు తమ సరుకులను నిల్వ చేసుకునేందుకు వీలు కల్పించే ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్ సంస్థ... హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న గోదాముకు అదనంగా 4 లక్షల చదరపుటడుగులను జత చేసింది.

హైదరాబాద్‌లో  మహీంద్రా వేర్‌హౌస్ సామర్థ్యం పెంపు... కరోనా వ్యాక్సీన్ నిల్వలకు కూడా

హైదరాబాద్ : మహీంద్రా లాజిస్టిక్స్ హైదరాబాద్‌లో తమ వేర్‌హౌస్ గిడ్డంగుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటోంది. పండుగ సీజన్ డిమాండ్‌ను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ నగరాల్లోని గిడ్డంగుల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్, వాహన సంస్థలు, ఫార్మారంగాలకు చెందిన సంస్థలకు తమ సరుకులను నిల్వ చేసుకునేందుకు వీలు కల్పించే ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్ సంస్థ... హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న గోదాముకు అదనంగా 4 లక్షల చదరపుటడుగులను జత చేసింది. హైదరాబాద్‌తో పాటు చెన్నైలో 3.5 లక్షల చదరపుటడుగుల సామర్థ్యాన్ని అదనంగా విస్తరించింది.


రెండు నగరాల్లో 7.5 లక్షల చదరపుటడుగులు... 

థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవల సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ హైదరాబాద్, చెన్నై నగరాల్లో 7.5 లక్షల చదరపుటడుగుల సామర్థ్యాన్ని విస్తరించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో తలెత్తనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో 10 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో గిడ్డంగులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో దీనిని సిద్ధం చేస్తున్నట్లు మహీంద్ర కంపెనీ ఎండీ, సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు. వ్యాపారావకాశాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.


కరోనా వ్యాక్సీన్ నిల్వలకు వేర్‌హౌస్ విస్తరణ...

కరోనా మహమ్మారికి వ్యాక్సీన్ వచ్చిన తర్వాత అవసరమైన నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు, చివరివరకు సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని జహీరాబాద్ సమీపంలో గ్రేడ్ ఏ వేర్ హౌసింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు.


పెరుగుతున్న వ్యాపారాలు...

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా వ్యాపారాలు తగ్గాయి. అయితే ఈ-కామర్స్ వ్యాపారం మాత్రం జోరుగా ఉంది. అదే సమయంలో ఫార్మా రంగం కూడా ఆశాజనకంగా ఉంది. మార్చి నుండి భారీగా పడిపోయిన వాహన విక్రయాలు, అక్టోబర్‌లో రికార్డ్ స్థాయికి పుంజుకున్నాయి. పండుగ సీజన్‌లో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా లాజిస్టిక్స్ వేర్ హౌస్‌లను విస్తరిస్తోంది.


Updated Date - 2020-11-06T21:18:35+05:30 IST