లండన్‌ కోర్టులో మాల్యా

ABN , First Publish Date - 2020-12-20T06:22:49+05:30 IST

ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంక్‌ల కన్సార్షియం లండన్‌ కోర్టులో విజయ్‌ మాల్యాపై దాఖ లు చేసిన దివాలా పిటిషన్‌పై శనివారం నాడు వీడి యో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిగింది...

లండన్‌ కోర్టులో మాల్యా

  • దివాలా పిటిషన్‌పై విచారణ 


లండన్‌: ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంక్‌ల కన్సార్షియం లండన్‌ కోర్టులో విజయ్‌ మాల్యాపై  దాఖ లు చేసిన దివాలా పిటిషన్‌పై శనివారం నాడు వీడి యో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిగింది. భారత చట్టాల ప్రకారం బ్రిటన్‌లో దివాలా పిటిషన్‌ చెల్లుబాటుపై చీఫ్‌ ఇన్‌సాల్వెన్సీ అండ్‌ కంపెనీస్‌ కోర్టు (ఐసీసీ) జడ్జి మైకేల్‌ బ్రిగ్స్‌ ముందు ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అలాగే, ఇరు వర్గాల తరఫున భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఎక్స్‌పర్ట్‌ విట్‌నె్‌సలుగా హాజరయ్యారు. మాల్యా తరఫున మాజీ జడ్జి దీపక్‌ వర్మ, ఎస్‌బీఐ కన్సార్షియం తరఫున రిటైర్డ్‌ జడ్జి గోపాల గౌడ ప్రాతినిథ్యం వహించారు. బకాయిల రికవరీ కోసం బ్రిటన్‌లో ప్రయత్నించేందుకు ఈ కేసుతో సంబంధం ఉన్న భారత ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునే హక్కు తమకుందన్నది బ్యాంక్‌ల కన్సార్షియం వాదన. అయితే, ఇది ప్రజల సొమ్ము, ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున బ్యాంక్‌లు సెక్యూరిటీని వదులుకోలేవన్నది మాల్యా తరఫు వాదన. మాల్యాకు చెందిన మూతపడిన విమాన సంస్థ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌.. ఈ బ్యాంక్‌ల కన్సార్షియానికి రూ.9,000 కోట్లకు పైగా బకాయిపడింది. ఇప్పటికే పలు బ్యాంక్‌లు మాల్యాను ఉద్దేశపూరిత రుణ ఎగవేతదారుగా ప్రకటించాయి.


Updated Date - 2020-12-20T06:22:49+05:30 IST