ఎల్‌వీబీ డిపాజిటర్ల సొమ్ము భద్రం

ABN , First Publish Date - 2020-11-19T06:13:27+05:30 IST

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ నియమిత బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ టీఎన్‌ మనోహరన్‌ అన్నారు...

ఎల్‌వీబీ డిపాజిటర్ల సొమ్ము భద్రం

  • బ్యాంక్‌ వద్ద తగినన్ని నిధులున్నాయ్‌.. 
  • ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటర్‌ ప్రకటన 


ముంబై: లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ నియమిత బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ టీఎన్‌ మనోహరన్‌ అన్నారు. బ్యాంక్‌లో డిపాజిటర్లు దాచుకున్న సొమ్ము భద్రమని ఆయన అన్నారు. డిపాజిటర్లకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంక్‌ వద్ద తగినన్ని నిధులున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌)లో ఎల్‌వీబీ విలీనం ఆర్‌బీఐ నిర్దేశించిన గడువులోగా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎల్‌వీబీ బోర్డును 30 రోజులపాటు తన ఆధీనంలోకి తీసుకున్న ఆర్‌బీఐ.. కెనరా బ్యాంక్‌ మాజీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మనోహరన్‌ను బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఎల్‌వీబీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్‌బీఐ.. బ్యాంక్‌ డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించేందుకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కాగా, ఎల్‌వీబీపై డిసెంబరు 16 వరకు మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 45 ప్రకారం ఆర్‌బీఐ సమర్పించిన అప్లికేషన్‌ ఆధారంగా ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది. మారటోరియంలో భాగంగా బ్యాంక్‌ డిపాజిటర్లు తమ ఖాతా నుంచి నెల రోజుల్లో ఉపసంహరించుకోగలిగే నగదు పరిమితిని రూ.25,000కు కుదించింది. 


విలీనం జాతి ప్రయోజనాలకు విరుద్ధం: ఏఐబీఓసీ 

డీబీఐఎల్‌లో ఎల్‌వీబీ విలీనాన్ని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌(ఏఐబీఓసీ) వ్యతిరేకించింది. ఇది జాతి ప్రయోజనాలకు విరుద్ధమన్న ఏఐబీఓసీ.. డీబీఐఎల్‌కు బదులు ఏదేని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఎల్‌వీబీని విలీనం చేయాలని డిమాండ్‌ చేసింది. 


డీబీఎస్‌ కార్యకలాపాలు 

మరింత విస్తృతం: మూడీస్‌ 

ఎల్‌వీబీని విలీనం చేసుకోవడం ద్వారా డీబీఎస్‌ బ్యాంక్‌ భారత కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అభిప్రాయపడింది. విలీనం తర్వాత డీబీఎస్‌ ఇండియా డిపాజిట్లు 50 శాతం, నికర రుణాలు 70 శాతం మేర వృద్ధి చెందుతాయని తాజా నోట్‌లో పేర్కొంది. డీబీఎస్‌ బ్యాంక్‌కు దేశంలో 27 బ్రాంచీలున్నాయి. 



మనోహరన్‌ వెల్లడించిన ఎల్‌వీబీ డిపాజిట్లు, రుణాల వివరాలు.. 

  1. రూ.20,070 కోట్లు- బుధవారం నాటికి బ్యాంక్‌ వద్దనున్న మొత్తం డిపాజిట్లు 
  2. రూ.14,000 కోట్లు - మొత్తం డిపాజిట్లలో టర్మ్‌ డిపాజిట్ల వాటా 
  3. రూ.6,070 కోట్లు- మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్‌, కరెంట్‌ డిపాజిట్ల వాటా 
  4. 20 లక్షలకు పైగా - మొత్తం డిపాజిటర్ల సంఖ్య 
  5. రూ.10 కోట్లు - మంగళవారం సాయంత్రం నుంచి ఎల్‌వీబీ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకున్న సొమ్ము 
  6. రూ.17,325 కోట్లు - బ్యాంక్‌ లోన్‌ బుక్‌ విలువ 

Updated Date - 2020-11-19T06:13:27+05:30 IST