కష్టకాలంలోనూ.. సత్తా చాటింది

ABN , First Publish Date - 2020-11-06T06:18:03+05:30 IST

కొవిడ్‌ కష్టకాలంలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ స్థిరంగా నిలవటమే కాకుం డా తన సత్తా చాటిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు తెలిపారు...

కష్టకాలంలోనూ.. సత్తా చాటింది

  • హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమపై మంత్రి కేటీఆర్‌
  • ఎగుమతులు 18శాతం పెరిగాయ్‌
  • హైసియా అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ కష్టకాలంలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ స్థిరంగా నిలవటమే కాకుం డా తన సత్తా చాటిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఐటీ కంపెనీలు కొంత మేరకు ఉద్యోగుల తొలగింపులు చేసినప్పటికీ.. కొవిడ్‌ కారణంగా ఎటువంటి తొలగింపులు చేయలేదన్నారు. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వార్షిక ఇన్నోవేషన్‌ సదస్సు అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కీలకోపన్యాసం చేశారు. హైసియా వంటి సంస్థలతో కలిసి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయటమే కాకుండా ఉద్యోగుల తొలగింపుపై కంపెనీలకు కౌన్సిలింగ్‌ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఐటీ కంపెనీలు అండగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నా.. దీర్ఘకాలంలో క్యాంప్‌సలు, కార్యాలయాలు కొనసాగుతాయన్నారు. గత ఆర్థిక సంవత్సంలో దేశీయంగా సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 8 శాతం పెరిగితే.. తెలంగాణ ఐటీ ఎగుమతులు 18 శాతం పెరిగాయని కేటీఆర్‌ అన్నారు.


400శాతం పెరిగిన కార్యాలయ గిరాకీ..

2013లో హైదరాబాద్‌లో కార్యాలయ స్థలానికి గిరాకీ 0.3 మిలియన్‌ చదరపు మీటర్లు ఉంటే.. 2019 నాటికి 1.2 మిలియన్‌ చ.మీ పెరిగింది. కార్యాలయ స్థల వినియోగంలో గత ఆరేళ్లలో 6 నుంచి 2 స్థానానికి హైదరాబాద్‌ ఎదిగిందన్నారు. 


కొల్లూరులో ఐటీ క్లస్టర్‌

ఉప్పల్‌, పోచారం, కొంపల్లి వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు విస్తరించాలని, అక్కడ ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఎస్‌ఎంఈల కోసం కొంపల్లిలో కొత్త టవర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌కు వాయువ్య ప్రాంతం కొల్లూరులో కొత్త క్లస్టర్‌ను నెలకొల్పుతున్నాం. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ చుట్టుపక్కల అభివృద్ధి చెందే విధంగా గ్రిడ్‌ పాలసీని అనుసరిస్తున్నాం. కొత్త ప్రదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభించే చిన్న ఐటీ కంపెనీలకు 30 శాతం అద్దె రాయితీ ఇస్తున్నాం. గ్రిడ్‌ ప్రాంతాల్లో 500 మందికి మించి ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు వారికి అనుకూలమైన ప్యాకేజీ ఇస్తున్నామని మంత్రి అన్నారు. 


హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమపై శ్వేత పత్రం..

కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ చేపట్టాల్సిన చర్యలపై హైసియా శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. కార్యక్రమంలో హైసియా ప్రెసిడెంట్‌ భరణీ, ఇన్ఫోసిస్‌ సీఓఓ యూబీ ప్రవీణ్‌ రావు, ఎస్‌టీపీఐ డైరెకర్‌ జనరల్‌ ఓంకార్‌ రాయ్‌, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుల కార్యక్రమంలో ఇన్నోవేషన్‌, సైబర్‌ ట్రైనింగ్‌ కోసం టీ-హబ్‌, టాస్క్‌తో హైసియా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. 


సత్యనారాయణకు జీవిత సాఫల్య అవార్డు

ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషికి గాను ప్రస్తుతం వరల్డ్‌ ఎకనామిక్‌ఫోరమ్‌ సలహాదారుగా ఉన్న జే సత్యనారాయణకు హైసియా ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డును ప్రదానం చేశారు. కొవిడ్‌ కష్టకాలంలో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు అండగా నిలిచిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు ‘ప్రత్యేక గుర్తింపు’ అవార్డు ఇచ్చారు. 


ఇన్ఫోసిస్‌, టీసీఎ్‌సలకు ఎగుమతి అవార్డులు..

అత్యధిక ఐటీ ఎగుమతులు చేసిన కంపెనీల కేటగిరిలో ఇన్సోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రాలకు అవార్డులు లభించాయి. ఎంఎన్‌సీల విభాగంలో అత్యధిక ఎగుమతులు చేసిన కంపెనీలుగా డెలాయిట్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ అవార్డులు అందుకున్నాయి. నికరంగా అధిక ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీగా టీసీఎస్‌ అవార్డు అందుకుంది. 2919 -20 ఏడాదికి నికరంగా అత్యధిక మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీగా కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ నిలిచింది. ఈ రెండు అవార్డులను హైసియా కొత్తగా ప్రవేశపెట్టింది. బెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌, అత్యధికంగా వృద్ధి చెందుతున్న కంపెనీ, చిన్న ఐటీ కంపెనీలు మొదలైన విభాగాల్లో హైసియా అవార్డులు ప్రదానం చేసింది.

Updated Date - 2020-11-06T06:18:03+05:30 IST