సవాళ్లున్నా సత్తా చాటిన ఐటీ

ABN , First Publish Date - 2020-12-30T08:23:26+05:30 IST

కొవిడ్‌-19 భారత ఐటీ రంగాన్నీ కుదిపేసింది. అడ్డంకులు లేకుండా ఖాతాదారులకు సేవలు అందించడం, ఉద్యోగులను కొవిడ్‌ నుంచి కాపాడుకోవడం ఐటీ కంపెనీలకు పెద్ద సవాల్‌గా మారింది...

సవాళ్లున్నా సత్తా చాటిన ఐటీ

  • కొత్త ఏడాదీ పరుగు ఆగదు
  • డిజిటైజేషన్‌తో మరిన్ని అవకాశాలు
  • కొత్త ఏడాది మళ్లీ నియామకాలు     

కొవిడ్‌-19 భారత ఐటీ రంగాన్నీ కుదిపేసింది. అడ్డంకులు లేకుండా ఖాతాదారులకు సేవలు అందించడం, ఉద్యోగులను కొవిడ్‌ నుంచి కాపాడుకోవడం ఐటీ కంపెనీలకు పెద్ద సవాల్‌గా మారింది. అదే సమయంలో అమెరికా, ఐరోపా దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని స్వదేశానికి తీసుకు రావడం పెద్ద సమస్యగా మారింది. వీరిని రప్పించేందుకు ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్ర వంటి కంపెనీలు ప్రత్యేకంగా ఛార్టర్డ్‌ విమాన సర్వీసులు నడపాల్సి వచ్చింది. 


ఆదుకున్న టెక్నాలజీ

అయితే 2020లో టెక్నాలజీ సాయంతో భారత ఐటీ పరిశ్రమ కొవిడ్‌ సవాల్‌ను విజయవంతంగా తట్టుకుని నిలబడింది. 4జీ పుణ్యమాని బ్రాండ్‌బ్యాండ్‌ స్పీడ్‌ పెరగడం ఇందుకు దోహదం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీలు రాత్రికి రాత్రి ఇంటి నుంచే పని (డబ్ల్యుఎ్‌ఫహెచ్‌) విధానం ప్రకటించాయి. ఐటీ ఉద్యోగులూ అందుకు వెంటనే సిద్ధమై పోయారు. దాదాపు 98 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తూ, ఖాతాదారుల సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక వెసులుబాటుగా ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు కొవిడ్‌ పుణ్యమాని ఐటీ కంపెనీల రోజువారీ నిర్వహణలో ఒక భాగమై పోయింది. 


2021 ఆశాజనకం 

కొవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పటికీ కుంటి నడక నడుస్తున్నాయి. ఐటీ రంగంపై మాత్రం ఆ ప్రభావం పెద్దగా లేదు. కోవిడ్‌ కారణంగా అన్ని రంగాల్లో డిజిటైజేషన్‌ పెరిగింది. ఇది భారత ఐటీ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు తెచ్చిపెడుతోంది. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ దిగ్గజాలు ఇప్పటికే ఇలాంటి సేవల కోసం పలు అమెరికా, ఈయూ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశంలోనూ అనేక వ్యాపార సంస్థలు, రంగాలు డిజిటల్‌ బాట పట్టాయి. ఇవన్నీ ఐటీ కంపెనీలకు కలిసి రానున్నాయి. 


మళ్లీ నియామకాలు 

కొవిడ్‌తో ఐటీ కంపెనీలు నియామకాలు పక్కన పెట్టాయి. చాలా కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ప్లేస్‌మెంట్‌ ఆఫర్లనూ తుంగలో తొక్కాయి. కొత్త ప్రాజెక్టులతో ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ప్రాజెక్టు మేనేజర్లు, డిజిటల్‌ టెక్నాలజీలో ప్రత్యేక నైపణ్యాలు ఉన్న సీనియర్లనైతే  పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇచ్చి మరీ తన్నుకుపోతున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఉన్న నిపుణులు వేరే కంపెనీలవైపు చూడకుండా ముందే జీతాల పెంపు, ప్రమోషన్లు ప్రకటిస్తున్నాయి. 


సవాళ్లు 

భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపిస్తున్నా కొన్ని అంశాలు భారత ఐటీ కంపెనీలను ఇప్పటికీ వేధిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసాలపై కొత్త అధ్యక్షుడు బైడన్‌ వైఖరి ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తున్నాయి. ఐరోపాలో మరో కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ ప్రబలడం ఒకింత భయపెడుతోంది. ఆగమేఘాల మీద అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ సత్తా మీదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2020-12-30T08:23:26+05:30 IST