పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గాయిలా..
ABN , First Publish Date - 2020-04-05T06:04:57+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయం మేరకు బ్యాంకులు తాము జారీ చేసే వివిధ రకాల రుణాలపై...

కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయం మేరకు బ్యాంకులు తాము జారీ చేసే వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇదే సమయంలో కస్టమర్ల డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లలో కోత విధించాయి. రుణాలపై వడ్డీ భారం తగ్గడం వల్ల చాలా మంది రుణగ్రహీతలు సంతోషిస్తున్నారు. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించడం వల్ల ఈ ఆదాయంపై ఆధారపడిన డిపాజిట్‌దారులు నిరాశకు గురవుతున్నారు.
ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనా వడ్డీ రేట్లను తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వచ్చే జూన్ 30వరకు (ఏప్రిల్-జూన్ త్రైమాసికం) ఈ రేట్లు కొనసాగుతాయి. ఈసారి ఈ పథకాలపై వడ్డీ రేటు చాలా తగ్గింది. ముఖ్యంగా పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లపై కోత ఎక్కువగా ఉంది. ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎ్‌ఫ)పై కూడా వడ్డీ తగ్గింపు అధికంగానే ఉంది.
పీపీఎఫ్: పాపులర్ టాక్స్, దీర్ఘకాలిక పొదుపు పథకమిది. మెచ్యూరిటీ కాలపరిమితి 15 ఏళ్లు ఉంటుంది. దీని వడ్డీ రేటును ఏకంగా 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించారు
సుకన్య సమృద్ధి యోజన: ఆడ పిల్లల కోసం తెచ్చిన పొదుపు పథకమిది. దీనిపై వడ్డీ రేటు ఇంతకు ముందు 8.4 శాతం ఉండగా.. దీన్ని 7.6 శాతానికి
తగ్గించారు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: ఈ పథకంపై వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు
ఎన్‌ఎ్‌ససీ: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించారు
ఐదేళ్ల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్: ఈ పథకంపై వడ్డీ రేటును 7.2 శాతం నుంచి ఏకంగా 5.8 శాతానికి తగ్గించడం గమనార్హం.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ): ఇంతకు ముందు ఇందులో పెట్టుబడి పెడితే 113 నెలల్లో రెండింతలయ్యేది. ఇప్పుడది 124 నెలలకు పెరిగింది. దీనిపై వచ్చే రాబడి 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గింది.
పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు: తాజా తగ్గింపుతో పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ల (1-3 ఏళ్లు) వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గిపోయింది. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించి వేశారు.
ఇలా చేయవచ్చు...
డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అనేక మంది కలవరపడుతున్నారు. తమకు అధిక ఆదాయాన్నిచ్చే ఆర్థిక సాధనాల గురించి వెతుకుతున్నారు. ఎక్కువ రిటర్నులు రావాలని భావించే వారు బ్యాంకింగ్, పీఎ్‌సయూ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే అంశా న్ని పరిశీలించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల్లో ఇవి వార్షికంగా 7.5 శాతం వరకు రిటర్నును ఇవ్వడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర డెట్ ఫండ్స్‌తో పోల్చితే బ్యాంకింగ్, పీఎ్‌సయూ డెట్ ఫండ్స్ భద్రమైనవంటున్నారు. బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పీఎ్‌సయూలకు సావరిన్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి భరోసాగా ఉండవచ్చని సూచిస్తున్నారు. తమ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం వరకు ఈ కేటగిరీ కోసం కేటాయించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
