సంపద వృద్ధికి కొత్త పెట్టుబడి మార్గాలు
ABN , First Publish Date - 2020-08-16T07:07:40+05:30 IST
పెట్టుబడుల స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పెద్దగా నష్ట భయం (రిస్క్) లేకుండా ఉన్న సంపద పెం చుకునేందుకు మదుపరులు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు...

పెట్టుబడుల స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పెద్దగా నష్ట భయం (రిస్క్) లేకుండా ఉన్న సంపద పెం చుకునేందుకు మదుపరులు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లోనూ అనేక సరికొత్త పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ)తో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపద వృద్ధికి బాటలు వేసుకోవచ్చని ఫిన్‌ట్ర్‌స్ట అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ జోషి అంటున్నారు. ఆ వివరాలు..
ఇండెక్స్ ఫండ్స్: ఎంత మంచి కంపెనీ షేర్లకైనా ఆటుపోట్లు తప్పవు. ఈ ఆటుపోట్ల నుంచి తప్పించుకునేందుకు చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు నిఫ్టీ 100, క్వాలిటీ 30, నిఫ్టీ 200, నిఫ్టీ 50 వంటి ఇండెక్స్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారు. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇందుకోసం ప్రత్యేకంగా ఈటీఎఫ్ పథకాలే తీసుకొచ్చాయి. ఆయా కంపెనీల షేర్లతో పోలిస్తే ఈ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎ్‌ఫల్లో ఆటుపోట్లు తక్కువ. దీంతో పెద్దగా రిస్క్ తీసుకోలేని చాలామంది ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారు.
స్టార్టప్స్: స్టార్టప్ కంపెనీలు కూడా ఇన్వెస్టర్లకు కొత్త పెట్టుబడి అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టార్టప్ ఐడియా వ్యాపార పరంగా క్లిక్ అవుతుందనుకుంటే చాలు. పుష్కలంగా నిధులు వచ్చి పడుతున్నాయి. కొంతమంది పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలు ఇందుకోసం ప్రత్యేకంగా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) ఫండ్స్ ఏర్పాటు చేసి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల కొందరు క్రీడాకారులు, సినీ ప్రముఖులు కూడా ఈ జాబితాలో చేరారు.
రీట్స్ : రియల్ ఇన్వె్‌స్టమెంట్స్ ట్రస్ట్స్‌గా పిలిచే రీట్స్‌కు అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. ఆ దేశాల్లోని చాలా మంది సంపన్నుల పెట్టుబడుల్లో ఈ రీట్స్ ఒక భాగం. ఎంబసీ రీట్స్ ఐపీఓతో మన దేశంలోనూ ఇది ప్రారంభమైంది. రహేజా మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉంది. పెట్టుబడుల వివిధీకరణ కోరుకునే మదుపరులు రీట్స్‌పై దృష్టి పెట్టవచ్చు.