ప్రమోషన్లు లేవ్.. జీతాలు పెంచం!
ABN , First Publish Date - 2020-04-21T08:06:41+05:30 IST
కోవిడ్-19 వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉద్యోగులకు

కరోనా సంక్షోభంలో ఇన్ఫోసిస్ నిర్ణయం
క్యూ4లో లాభం రూ.4,335 కోట్లు
భవిష్యత్ అంచనాలివ్వలేమన్న కంపెనీ
ఒక్కో షేరుపై రూ.9.50 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: కోవిడ్-19 వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉద్యోగులకు ప్రమోషన్లను, జీతాల పెంపును నిలిపివేసింది. అయితే, ఉద్యోగాలకు ముప్పులేదని, ఇప్పటికే జాబ్ ఆఫర్ చేసిన వారినీ ఉద్యోగంలో చేర్చుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ సైతం తన ఉద్యోగులకు జీతాల పెంపును నిలిపివేసింది. దీంతో మిగతా ఐటీ కంపెనీలన్నీ ఇదేబాటలో పయనించే అవకాశం ఉంది.
లాభంలో 6.3% వృద్ధి
మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఇన్ఫీ లాభం 6.3 శాతం పెరిగి రూ.4,335 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2018-19)లో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.4,078 కోట్లుగా నమోదైంది. క్యూ4లో ఆదాయం 8 శాతం వృద్ధి చెంది రూ.23,267 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మొత్తానికి ఇన్ఫోసిస్ లాభం 8 శాతం వృద్ధితో రూ.16,639 కోట్లు, ఆదాయం 9.8 శాతం వృద్ధితో రూ.90,791 కోట్లుగా నమోదైంది.
డిజిటల్ సేవలదే మెజారిటీ వాటా
మార్చి త్రైమాసికానికి కంపెనీ మొత్తం ఆదాయంలో డిజిటల్ సర్వీసుల వాటానే 41.9 శాతం. ఈ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 29.6 శాతం వృద్ధి చెందింది.
గైడెన్స్ ఇవ్వలేం..
కరోనా సంక్షోభంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) కంపెనీ ఆదాయ అంచనాలను విడుదల చేయలేమని ఇన్ఫీ తెలిపింది. మార్కెట్ పరిణామాలపై స్పష్టత వచ్చాకే భవిష్యత్ గైడెన్స్ ఇవ్వగలమని కంపెనీ అంటోంది.
వాటాదారులకు ప్రతిఫలం
గత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.9.50 డివిడెండ్ చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ వద్ద పుష్కల నగదు నిల్వలకు ఇదే సాక్ష్యమని కంపెనీ పేర్కొంది.
ఉద్యోగులు.. వలసలు
మార్చి 31 నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2,42,371కి చేరుకుంది. గడిచిన త్రైమాసికంలో ఉద్యోగుల వార్షిక వలసల రేటు 20.7 శాతానికి
పెరిగింది.
మా ఉద్యోగుల్లో కొందరికి కరోనా పాజిటివ్..
అంతర్జాతీయంగా మా సంస్థ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వీరు సహోద్యోగుల్లో ఎవరెవరితో సంప్రదింపులు జరిపారని గుర్తించే పనిలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
స్వల్పకాలం పాటు కంపెనీ వ్యాపారంపై కరోనా ప్రభావం చూపనుంది. రికవరీ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
- సలీల్ పరేఖ్, సీఈఓ, ఎండీ , ఇన్ఫోసిస్