పారిశ్రామికం అథోపాతాళం

ABN , First Publish Date - 2020-05-13T06:54:00+05:30 IST

దేశంలో పారిశ్రామికోత్పత్తి అథోపాతాళానికి కూరుకుపోయింది. కరోనా కాటుతో 50 రోజులుగా అన్ని రంగాలు మూసివేతలో ఉన్న ప్రభావం పారిశ్రామికోత్పత్తిపై...

పారిశ్రామికం అథోపాతాళం

న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి అథోపాతాళానికి కూరుకుపోయింది. కరోనా కాటుతో 50 రోజులుగా అన్ని రంగాలు మూసివేతలో ఉన్న ప్రభావం పారిశ్రామికోత్పత్తిపై పడింది. మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి 16.7 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేయడమే ఇందుకు తార్కాణం. ఫిబ్రవరిలో ఇది ఏడు నెలల గరిష్ఠ స్థాయి 4.5 శాతం వృద్ధిని నమోదు చేయగా గత ఏడాది మార్చిలో 2.7 శాతం వృద్ధి సాధించింది. పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చిలో పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 కీలక రంగాలు 6.47 శాతం క్షీణతను నమోదు చేశాయి.


విభాగాల వారీగా తయారీ రంగం (20.6 శాతం), ఆటోమొబైల్‌ (-49.6 శాతం), విద్యుత్‌ పరికరాలు (-31 శాతం), హార్డ్‌వేర్‌, ఆప్టికల్‌ ఎక్వి్‌పమెంట్‌ (-41.7 శాతం), యంత్రపరికరాలు (-35.6 శాతం), కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ (-33.1 శాతం) క్షీణించాయి. ఐఐపీ భారీ క్షీణత ప్రభావం ఈ నెల ద్వితీయార్ధంలో విడుదల కానున్న జీడీపీ గణాంకాలపై కూడా భారీగానే ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మొత్తం 23 పారిశ్రామిక విభాగాల్లో 7 విభాగాలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. కాగా గణాంకాల సేకరణ సాధ్యపడకపోవడం వల్ల ఏప్రిల్‌ నెలకు రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రకటించడంలేదని అధికారవర్గాలు తెలిపాయి.


Read more