నెంబర్‌ 2 సంపన్నుడు ‘డీమార్ట్‌’ దమానీ

ABN , First Publish Date - 2020-02-16T06:54:46+05:30 IST

దేశంలో నెంబర్‌ వన్‌ సంపన్నుడు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ. మరి రెండో స్థానంలో ఉన్న సంపన్నుడు ఎవరో తెలుసా? ఆయన అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ వ్యవస్ధాపకుడు, డీమార్ట్‌ ప్రమోటర్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాధాకృష్ణన్‌ దమానీ.

నెంబర్‌ 2 సంపన్నుడు ‘డీమార్ట్‌’ దమానీ

  • 1,780 కోట్ల డాలర్లకు చేరిన సంపద..
  • ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడి 


దేశంలో నెంబర్‌ వన్‌ సంపన్నుడు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ. మరి రెండో స్థానంలో ఉన్న సంపన్నుడు ఎవరో తెలుసా? ఆయన అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ వ్యవస్ధాపకుడు, డీమార్ట్‌ ప్రమోటర్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాధాకృష్ణన్‌ దమానీ. దమానీతోపాటు ఆయన కుటుంబ సంపద 1,780 కోట్ల డాలర్లుగా ఉందని ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 13న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు ధర రూ.2,559 స్థాయికి చేరుకుంది. ఫలితంగా దమానీ కుటుంబ సంపద 9.6 కోట్ల డాలర్లు పెరిగి 1,780 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇటీవలే షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ.4,000 కోట్లు కంపెనీ సమీకరించింది. ఈ నేపథ్యంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు జోరు పెరిగింది. ఇదే దమానీని రెండో అతిపెద్ద సంపన్నుడిని చేసింది. దమానీ కుటుంబంలో గోపీకృష్ణన్‌ ఎస్‌ దమానీ, శ్రీకాంతాదేవీ ఆర్‌ దమానీ, కిరణ్‌ దేవీ జీ దమానీ ఉన్నారు. వీరు కూడా అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రమోటర్లుగా ఉన్నారు. తొలి డీమార్ట్‌ స్టోరు ముంబైలో 2002లో ప్రారంభించారు. 2018 వార్షిక నివేదిక ప్రకారం 11 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 176 డీమార్ట్‌ స్టోర్లున్నాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రాబడి రూ.19,916 కోట్లు ఉండగా.. లాభం రూ.936 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే.. ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ముకేష్‌ అంబానీ సంపద 5,740 కోట్ల డాలర్లుగా ఉంది. దమానీ తర్వాతి స్థానాల్లో హెచ్‌సీఎల్‌ సారథి శివ్‌ నాడార్‌ (1,650 కోట్ల డాలర్లు), ఉదయ్‌ కోటక్‌ (1,490 కోట్ల డాలర్లు), గౌతమ్‌ అదానీ (1,410 కోట్ల డాలర్లు), లక్ష్మీ మిట్టల్‌ (1,210 కోట్ల డాలర్లు) ఉన్నారు.

Updated Date - 2020-02-16T06:54:46+05:30 IST