యూ లేదా డబ్ల్యూ షేప్ రికవరీ!
ABN , First Publish Date - 2020-06-23T05:50:59+05:30 IST
కొవిడ్-19 కారణంగా దాదాపు రెండు నెలలు లాక్‌డౌన్ పాటించడం భారత ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చిందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ (సీఐఆర్) వెల్లడించింది...

- రెండేళ్ల వరకు డిమాండ్‌కు కష్టాలే
- సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్స్
న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా దాదాపు రెండు నెలలు లాక్‌డౌన్ పాటించడం భారత ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చిందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ (సీఐఆర్) వెల్లడించింది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికిప్పుడు కోలుకునే అవకాశం లేదని, రెండేళ్ల వరకు డిమాండ్ ఏ మాత్రం పుంజుకోకపోవచ్చని సెంట్రమ్ అంచనా వేసింది. కొవిడ్-19 కంటే ముందే ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉండగా వైరస్ కారణంగా సంక్షోభంలోకి జారుకుందని తెలిపింది.
లాక్‌డౌన్ కారణంగా కోవిడ్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గినా, వైరస్ గరిష్ఠ స్థాయికి చేరడం ఆలస్యమైందని తెలిపింది. కాగా కరోనా కారణంగా కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ అందరూ ఊహిస్తున్నట్లుగా ఇంగ్లీష్ అక్షరం ‘వీ’ ఆకారంలో కాకుండా ‘యూ’ లేదా ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. వృద్ధి రేటు వేగంగా పడిపోయి..వేగంగా కోలుకోవడాన్ని ‘వీ’ షేప్ రికవరీగా పరిగణిస్తారు. వృద్ధి రేటు వేగంగా పడిపోయి, చాలా కాలం అదే స్థాయిలో ఉండి, తర్వాత కోలుకోవడాన్ని ‘యూ’ షేప్ రికవరీగా, వృద్ధి రేటు వేగంగా పడిపోయి వేగంగా కోలుకుని, మళ్లీ అంతే వేగంగా పడిపోయి, కోలుకోవడాన్ని ‘డబ్ల్యూ’ షేప్ రికవరీగా పరిగణిస్తారు.
వేగంగా గ్రామీణ డిమాండ్
కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి వస్తు, సేవల డిమాండ్ వేగంగా పుంజుకుంటుందని సీఐఆర్ అంచనా వేసింది. వరుణుడు కరుణించడం, పుష్కలంగా పంటలు పండడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇందుకు దోహదం చేయనున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఇదొక్కటే సానుకూల అంశమని సీఐఆర్ పేర్కొంది.