టాప్ మూడు ఆర్థికవ్యవస్థల్లో భారత్ : ముఖేష్ అంబానీ

ABN , First Publish Date - 2020-12-15T22:59:00+05:30 IST

ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా అవతరించనుందని, రానున్న రెండు దశాబ్దాల్లో ఇది జరుగుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలుంటాయన్నారు.

టాప్ మూడు ఆర్థికవ్యవస్థల్లో భారత్ : ముఖేష్ అంబానీ

ముంబై : ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా అవతరించనుందని, రానున్న రెండు దశాబ్దాల్లో ఇది జరుగుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలుంటాయన్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో ‘ఆన్‌లైన్ ముఖాముఖి’లో ముఖేష్ మాట్లాడారు. ‘ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. తొలి ఎడిషన్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ వర్చువల్ భేటీలో మార్క్, అంబానీ మాట్లాడారు. 


రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతుందని ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఇది నిలుస్తుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ. 33,737 కోట్లతో జియోలో 7.7 % వాటాను ఫేస్‌బుక్ దక్కించుకుందని చెప్పారు. దేశంలో డిజిటల్ కనెక్టివిటీకి జియో తెరతీసిందని, వాట్సాప్-నౌ ద్వారా వాట్సాప్ డిజిటల్ ఇంటర్-కనెక్టివిటీని కల్పిస్తోందని, రిటైల్ రంగంలో జియో మార్ట్ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అపారావకాశాలను కల్పిస్తోందని వెల్లడించారు. 


ఇక... గ్రామాలు, చిన్న పట్టణాలలోని దుకాణాలకు కూడా డిజిటలైజేషన్ ద్వారా బిజినెస్ అవకాశాలకు అవకాశమేర్పడుతోందని అంబానీ పేర్కొన్నారు. డిజిటల్ సొసైటీగా మారుతున్న నేపధంమలో రానున్న రెండు దశాబ్దాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్ 3 లో ఒకటిగా ఆవిర్భవించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. 


దేశంలో తలసరి ఆదాయం ఇప్పుడున్న 1,800-2,000 డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు పెరగవచ్చునని అంబానీ పేర్కొన్నారు. దేశంలో 50 శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయని, ప్రతీ ఏటా వీరి ఆదాయం 3-4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. 


పేస్‌బుక్‌తో పాటు ఎన్నో కంపెనీలు, వ్యాపారవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావడంతో పాటు రానున్న దశాబ్దాల్లో జరిగే సామాజిక మార్పులో పాలుపంచుకోవడం సువర్ణావకాశమని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తావించదగ్గ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతి నెలకొందని మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ కారణంగా ఎన్నో అవకాశాలు పుట్టుకొచ్చాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తోందని, డిజిటల్ టూల్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. ఇక... ఇంటర్‌నెట్ ప్రయోజనాలు ప్రజలకు అందడంలో జియో కీలకంగా మారిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. 


Read more