పదేళ్లలో టాప్-3కి భారత్
ABN , First Publish Date - 2020-12-27T09:40:47+05:30 IST
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదు నుంచి 6వ స్థానానికి జారుకున్నట్లు అన్పిస్తోందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) పేర్కొంది.

2025లో మళ్లీ బ్రిటన్‌ను వెనక్కినెట్టి ఐదో అతిపెద్ద ఎకానమీగా అవతరణ
సీఈబీఆర్ తాజా నివేదిక అంచనా
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదు నుంచి 6వ స్థానానికి జారుకున్నట్లు అన్పిస్తోందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో (2025నాటికి) మళ్లీ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి ఎగబాకనుందని అంటోంది. అంతేకాదు, 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని తాజా నివేదికలో సీఈబీఆర్ అంచనా వేసింది. 2019లోనే భారత్ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ టాప్-5 ఎకానమీగా మారింది. కానీ, కరోనా సంక్షోభ ప్రభావంతో ఈ ఏడాది మళ్లీ మెట్టు కిందికి జారుకోనుందని రిపోర్టు తెలిపింది. బ్రిటన్‌కు చెందిన సీఈబీఆర్ రిపోర్టులో పేర్కొన్న మరిన్ని విషయాలు..
వచ్చే ఏడాది (2021) భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి పుంజుకోవచ్చు. 2022లో 7 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది.
భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందాక సాధారణంగానే జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. 2035 నాటికి 5.8 శాతానికి పరిమితం కావచ్చు.
2028 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగే అవకాశం ఉంది. గతంలో అంచనా వేసిన దానితో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే ఇది జరగనుంది. కరోనా సంక్షోభం నుంచి కోలుకునే విషయంలో రెండు దేశాల మధ్య అసమానతలే ఇందుకు కారణం.
మరో పదేళ్ల పాటు జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది. 2030లో జపాన్‌ను భారత్ వెనక్కి నెట్టనుంది. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని 2027లో భారత్ అధిగమించవచ్చు.
కరోనా సంక్షోభానికి ముందే భారత వృద్ధి గతి తప్పింది. 2018లో 6.1 శాతానికి పరిమితమైన జీడీపీ వృద్ధి రేటు 2019లో పదేళ్ల కనిష్ఠ స్థాయి 4.2 శాతానికి పడిపోయింది. 2016లో నమోదైన 8.3 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గింది. బ్యాంకింగ్ రంగంలో ప్రతికూలతలు, సంస్కరణలకు అనుగుణం గా ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు, అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం ఇందుకు కారణం.
కరోనా దెబ్బకు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి మైనస్ 23.9 శాతానికి క్షీణించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో మైనస్ 7.5 శాతం పతనాన్ని నమోదు చేసుకుంది.
లాక్‌డౌన్ ఆంక్షల తొలగింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నప్పటికీ.. ఉత్పత్తి స్థాయిలు ప్రీ-కొవిడ్ స్థాయికి ఇంకా చేరుకోలేదు. వ్యవసాయ రంగ పనితీరు మాత్రం ఆశాజనకంగా కన్పిస్తోంది.
దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా సంక్షోభ పరిణామాలపైనే దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ ఆధారపడి ఉంది.
