టీవీ ఓపెన్‌ సెల్‌పై మళ్లీ దిగుమతి సుంకం

ABN , First Publish Date - 2020-09-21T06:03:10+05:30 IST

టీవీల్లో ఉపయోగించే ఒక ఉపకరణం ఓపెన్‌ సెల్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటో తేదీ నుంచి తిరిగి విధించే ఆస్కారం ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి...

టీవీ ఓపెన్‌ సెల్‌పై మళ్లీ దిగుమతి సుంకం

న్యూఢిల్లీ: టీవీల్లో ఉపయోగించే ఒక ఉపకరణం ఓపెన్‌ సెల్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటో తేదీ నుంచి తిరిగి విధించే ఆస్కారం ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దిగుమతి సుంకం మినహాయింపు కాలపరిమితి ఈ నెలాఖరు నాటికి ముగియనున్న నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించే ఆస్కారం ఉన్నదంటున్నారు. తాము తయా రీ సామర్థ్యాలు సమకూర్చుకోవడానికి గడువు కావాలని టీవీ ఉత్పత్తిదారులు అభ్యర్థించడంతో ప్రభుత్వం గత ఏడాది ఒక సంవత్సర కాలానికి సుంకం నుంచి మినహాయింపు ప్రకటించింది. ఆ గడువు సెప్టెంబరు 30వ తేదీ నాటికి ముగియనుంది.


పరిశ్రమను టీవీల అసెంబ్లింగ్‌కే పరిమితం చేయకుండా దశల వారీగా తయారీ సామర్థ్యాలు పెంచడం ద్వారా తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఈ సుంకం తిరిగి విధించాలనుకుంటున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం అమలైతే టీవీ ధరలు 4 శాతం మేరకు పెరిగే ఆస్కారం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 32 అంగుళాల టీవీ ధరలు కనీసం రూ.600, 42 అంగుళాల టీవీ ధరలు రూ.1200-1500 మధ్యన పెరగవచ్చని వారన్నారు. 

Updated Date - 2020-09-21T06:03:10+05:30 IST