పెద్ద అంబర్‌పేట.. నయా హాట్‌కేక్‌

ABN , First Publish Date - 2020-02-08T10:41:51+05:30 IST

హైదరాబాద్‌.. అభివృద్ధిపథంలో దూసుకుపోతుండటంతో పాటు రోజురోజుకు నగరం నలుమూలలా విస్తరిస్తుకుంటూ..

పెద్ద అంబర్‌పేట.. నయా హాట్‌కేక్‌

  • విల్లాలు, ప్లాట్లకు భారీగా డిమాండ్‌.. అందుబాటులో ధరలు

హైదరాబాద్‌.. అభివృద్ధిపథంలో దూసుకుపోతుండటంతో పాటు రోజురోజుకు నగరం నలుమూలలా విస్తరిస్తుకుంటూ పోతోంది. దీంతో శివారు ప్రాంతాలన్నీ భాగ్యనగరంలో కలిసిపోతున్నాయి. మున్సిపాలిటీగా మారిన తర్వాత పెద్ద అంబర్‌పేట ప్రాంతమే ఇందుకు ఓ మంచి ఉదాహరణ. ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థిరాస్తి రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉండడం, చేరువలోనే బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) ఇందుకు మరింతగా దోహదపడుతున్నాయి.  


అందరికి అందుబాటులో

ఐటీ కారిడార్‌ ప్రాంతంలో స్థలాలు, ఫ్లాట్ల ధరలు, మధ్య తరగతికి అందుబాటులో లేనంత స్థాయికి చేరాయి. ఆ ప్రాంతంలో గజం స్థలం కొనుగోలు చేయాలన్నా రూ.లక్షలు పలుకుతోంది. పెద్ద అంబర్‌పేట ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చదరపు గజం ధర రూ.వేలల్లోనే ఉంది. దీంతో ఐటీ ఉద్యోగులూ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు. మెరుగైన మౌలిక వసతులతో ఈ ప్రాంతంలో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలూ వెలుస్తున్నాయి.  


పంచాయతీగా ఉన్నప్పటి నుంచే

పెద్ద అంబర్‌పేట.. ఎల్‌బీ నగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచాయతీగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రాంతం నివాసాలకు అనువుగా ఉండేది.  చాలా మంది అప్పట్లోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఓపెన్‌ ప్లాట్ల ను కొనుగోలు చేశారు. కొంతమంది డెవలపర్లు ఇప్పటికే  ఈ ప్రాంతంలో ఎనిమిది వరకు గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ఉన్న త వర్గాలకు చెందిన ప్రజలు ఈ కాలనీల్లో ఉంటున్నారు. 


మెరుగైన రవాణా సౌకర్యాలు

పెద్ద అంబర్‌పేట సమీపంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఎక్కితే, హైదరాబాద్‌లో ఏ ప్రాంతానికైనా త్వరగా చేరుకోవచ్చు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) రేడియల్‌ రోడ్డు కూడా పెద్ద అంబర్‌పేట సమీపంలోనే ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ, బెంగళూరు, ముంబై, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకూ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆదిభట్ల, పోచారం ప్రాంతాల్లో, ఐటీ కంపెనీల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులూ నివాసాలకు పెద్ద అంబర్‌పేటను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద అంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు, పసుమాముల, కళానగర్‌, తట్టి అన్నారం వంటి చోట్ల ప్రధాన ప్రాంతాల్లో చదరపు గజం ఖాళీ స్థలం రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య పలుకుతోంది. 


విల్లాలకు భలే గిరాకీ..

డిమాండ్‌ పెరగడంతో ఈ ప్రాంతంలోని విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల్లోనూ ధరలు చుక్కలంటుతున్నాయి. మౌలిక సదుపాయాల్ని బట్టి ఈ కాలనీల్లో చదరపు అడుగు (ఎస్‌ఎ్‌ఫటీ) రూ.4,500ల నుంచి రూ.8,000 వరకు ఉంది. మంచి రవాణా సదుపాయాలు ఉన్న నాగోల్‌, బండ్లగూడ రహదారి ప్రాంతంలో అయితే.. ఒక్కో విల్లా ధర రూ.80 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. 


హైదరాబాద్‌-విజయవాడ  జాతీయ రహదారిపై ఉన్న పెద్ద అంబర్‌పేట.. ఒకప్పుడు నగర శివార్లలోని పంచాయతీ.. ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. పురపాలక సంఘంగా మారిన తర్వాత ఈ ప్రాంత రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉండటం మరింతగా కలిసివచ్చింది. ఖాళీ ప్లాట్లు భారీగా అందుబాటులో ఉండటంతో పాటు ఐటీ ఉద్యోగులు తోడవడంతో విల్లాలూ వచ్చేశాయి. ఈ ప్రాంతంలో రియల్టీ కార్యకలాపాలు ఊహించలేనంతగా ఊపందుకున్నాయి. 


 -హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)


హైదరాబాద్‌ నగర ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి జోరుగా ఉందని మ్యాజిక్‌బ్రిక్స్‌ ప్రాప్‌ఇండెక్స్‌ క్యూ4 నివేదిక పేర్కొంది. ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉండటమేకాకుండా ఓఆర్‌ఆర్‌ ద్వారా మంచి కనెక్టివిటీ ఉండటం, మెట్రో రైల్‌  కూడా అందుబాటులో ఉండటం వంటివి వృద్ధికి దోహదపడుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ మార్కెట్లో ధరలు  నిలకడగా ఉన్నాయని, డిమాండ్‌ కూడా స్థిరంగా ఉందని పేర్కొంది. 


తట్టి అన్నారంలో  స్థలాలకు డిమాండ్‌

నాగోల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ రేడియల్‌ రోడ్డు పక్కనే ఉన్న తట్టి అన్నారంలో ఓపెన్‌ ప్లాట్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతంలో హెచ్‌ఎండీఏ అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్లు, ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లు భారీగా ఉన్నాయి. హరిణి వనస్థలి పార్కు కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. దీంతో చాలా మంది ఇక్కడ స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రేడియల్‌ రోడ్డు వెంట ఉన్న కుంట్లూరు, పసుమాముల, రాజీవ్‌ గృహకల్ప తదితర ప్రాంతాల్లో చదరపు గజం రూ.30,000పైగా పలుకుతోంది. నల్లగొండ, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్‌ తదితర ప్రాంతాల ప్రజలు ఈ ప్రాంతంలోనే స్థలాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2020-02-08T10:41:51+05:30 IST