బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ. 200 కోట్లు

ABN , First Publish Date - 2020-02-12T09:23:00+05:30 IST

బంగారం ఈటీఎ్‌ఫల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడయ్యే గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి జనవరి నెలలో

బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ. 200 కోట్లు

  • జనవరిలో పెట్టుబడుల వెల్లువ
  • ఏడేళ్ల గరిష్ఠ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌

న్యూఢిల్లీ: బంగారం ఈటీఎ్‌ఫల్లోకి భారీగా పెట్టుబడులు    వచ్చాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడయ్యే గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి జనవరి నెలలో ఏకంగా రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడేళ్ల తర్వాత (2012 డిసెంబరులో రూ.474 కోట్లు) ఒక నెలలో ఇంత గరిష్ఠ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. అలాగే వరుసగా మూడో నెల కూడా నికరంగా నిధుల రాక పాజిటివ్‌గా ఉంది. డిసెంబరు నెలలో రూ.27 కోట్లు, నవంబరులో రూ.7.68 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులపై దృష్టి సారించడమే ఇంత భారీగా నిధుల రాకకు కారణం. దీంతో ఇటీవల కాలంలో బంగారం పెట్టుబడులకు ఆదరణ పెరిగిందని పరిశీలకులంటున్నారు. 

జనవరిలో వచ్చిన నిధులతో గోల్డ్‌ ఈటీఎ్‌ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ 7.6 శాతం పెరిగి రూ.6,207 కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్లలో కూడా గత నెల భారీ పరిమాణంలో రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 44 ఎంఎఫ్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.27.85 లక్షల కోట్లకు చేరింది. 


తగ్గిన జువెలరీ ఎగుమతులు

జనవరిలో వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు 8.45 శాతం క్షీణిం చి రూ.21,146.59 కోట్లుగా నమోదైనట్లు వజ్రాభరణాల ఎగుమతి ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) వెల్లడించింది. గత ఏడాది ఇదే నెల లో ఈ ఎగుమతులు రూ.23,099.57 కోట్లుగా ఉన్నాయి. కాగా 2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకు వజ్రాభరణాల ఎగుమతులు 4.78 శాతం తగ్గి రూ.2,16,076.06 కోట్లుగా నమోదయ్యాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్‌-జనవరి కాలంలో ఎగుమతులు రూ.2,26,933.91 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు కట్‌, పాలిష్డ్‌ డైమండ్స్‌ (సీపీడీ) ఎగుమతులు కూడా 4.92 శాతం తగ్గి రూ.11,757.08 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 

Updated Date - 2020-02-12T09:23:00+05:30 IST