గృహ బీమా... యాడ్ ఆన్స్‌తో మరింత ధీమా
ABN , First Publish Date - 2020-12-06T06:25:28+05:30 IST
సొంతిల్లు ఉండగానే సరిపోదు. ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవడం కూడా తప్పనిసరి. ఏ కారణంతోనైనా ఇంటికి నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు బీమా రక్షణ తప్పనిసరి. ఇందుకు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎంతో ఉపయోగపడతాయి...

సొంతిల్లు ఉండగానే సరిపోదు. ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవడం కూడా తప్పనిసరి. ఏ కారణంతోనైనా ఇంటికి నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు బీమా రక్షణ తప్పనిసరి. ఇందుకు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే బేసిక్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతోనే పూర్తి భరోసాతో ఉండలేం. అవసరాన్ని బట్టి కొన్ని ప్రత్యేక ‘యాడ్ ఆన్’ కవరేజీ పాలసీలూ తీసుకుంటే మరింత మంచిది. ఇందుకు కొంత అదనంగా ఖర్చయినా ఇంటి బీమాపై మరింత ధీమాగా ఉండొచ్చు.
గృహబీమాకు సంబంధించి ప్రస్తుతం బీమా కంపెనీలు కొన్ని యాడ్ ఆన్ కవర్స్ అందిస్తున్నాయి. అవేమిటంటే..
- తాళం చెవులు పోతే వచ్చే నష్టం
- చోరీతో ఏర్పడే నష్టం, నగలు పోతే వాటిల్లే నష్టం
- తాత్కాలికంగా ఇల్లు మారాల్సి వస్తే ఏర్పడే నష్టం
- ఇంట్లో ఎలక్ర్టికల్, మెకానికల్ వస్తువులుపాడైతే వచ్చే నష్టం
- అగ్ని ప్రమాదాలు, తీవ్రవాదంతో ఎదురయ్యే నష్టాలు.
ఇందులో నాలుగు యాడ్ ఆన్ హోమ్ కవరేజీ కీలకమైనవి.
లయబిలిటీ కవర్
ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా మన ఇంట్లో లేదా ఇంటి వల్ల మూడో పార్టీకి ఏదైనా నష్టం జరిగితే బీమా రక్షణ లభిస్తుంది. ఇంట్లోని పని మనుషులకు జరిగే గాయాలకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ఈ యాడ్ ఆన్ ద్వారా రాబట్టుకోవచ్చు.
వస్తువులు పాడైతే
ప్రతి ఇంట్లోనూ తప్పనిరిగా అవసరమైన కొన్ని ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ వస్తువులు ఉంటాయి. ఒక్కోసారి ఈ వస్తువులు ఉన్న పళంగా బ్రేక్‌డౌన్ కావచ్చు. బ్రేక్‌డౌన్ యాడ్ ఆన్ కవరేజీ ఉంటే ఈ ఖర్చుల నుంచి రక్షణ పొందవచ్చు.
దొంగతనం
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి ఇంటికి ఇవాళ దొంగల భయం ఉంది. ఒక్కోసారి దొంగలు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో జొరబడి ఉన్నదంతా ఊడ్చుకుపోవచ్చు లేదా ఇంటికి కన్నం వేసి మరీ దోచుకుపోవచ్చు. యాడ్ ఆన్ కవరేజీ ద్వారా ఇలాంటి నష్టాలకూ బీమా రక్షణ పొందవచ్చు.
జువెలరీ కవర్
ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పాలసీదారు నగలకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా, బయటికి వెళ్లేటపుడు వాటిని వేసుకుని వెళ్లి పోగొట్టుకున్నా ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు.