ఇల్లు కట్టిస్తాం.. ఇబ్బంది లేకుండా

ABN , First Publish Date - 2020-12-01T06:34:41+05:30 IST

పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి విషయం పక్కన పెడితే.. ఇల్లు కట్టడంలో ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఒక్కటీ అనుకున్నట్లుగా జరగదు. ఇల్లు పూర్తయ్యే సరికి వ్యయం పెరుగుతుంది. అనుకున్న సమయానికి పూర్తి కాదు...

ఇల్లు కట్టిస్తాం.. ఇబ్బంది లేకుండా

  • ఇంటి స్ట్రక్చర్‌కు 10 ఏళ్ల వారెంటీ
  • వీఆర్‌లో ముందుగానే వీక్షించొచ్చు
  • హోకోమోకో సీఈఓ శ్రీపద్‌ నందిరాజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి విషయం పక్కన పెడితే.. ఇల్లు కట్టడంలో ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఒక్కటీ అనుకున్నట్లుగా జరగదు. ఇల్లు పూర్తయ్యే సరికి వ్యయం పెరుగుతుంది. అనుకున్న సమయానికి పూర్తి కాదు. ఇటువంటి ఇబ్బందులేమీ లేకుండా.. పారదర్శకత, నాణ్యత హామీ, అనుకున్న సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయడం వంటి ప్రమాణాలతో ఇల్లు కట్టిస్తామంటున్నారు హైదరాబాద్‌కు చెందిన హోకోమోకో స్టార్టప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీపద్‌ నందిరాజ్‌. ఇందుకోసమే టెక్నాలజీ ఆధారిత బిల్దింగ్‌ నిర్మాణ స్టార్ట్‌పను ఏర్పాటు చేశాం. స్థలం చూపిస్తే.. ఇల్లు చేతికిస్తామని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..


కంపెనీ సేవల గురించి వివరిస్తారా?

స్థలం చేతికి ఇస్తే.. ఇల్లు కట్టి ఇస్తాం. అనుమతులు తీసుకోవడం నుంచి ఆర్కిటెక్చర్‌, స్ట్రక్చరల్‌ డిజైన్‌, ఇంటి నిర్మాణం, ఇంటీరియర్స్‌, నిర్మాణ పర్యవేక్షణ అన్నీ చేపడతాం. పారదర్శకత, నాణ్య త హామీ, నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి వంటి ప్రమాణాలతో నిర్మాణ సేవలందిస్తున్నాం. రూ.60-70 లక్షల విలువైన ఇల్లు నిర్మాణంలో ఒక నెల జాప్యం జరిగితే.. అదనంగా దాదాపు రూ.లక్ష భారం పడుతుంది. ఇల్లు నిర్మాణానికి ముందే వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) టెక్నాలజీ ద్వారా నిర్మించబోయే ఇల్లు ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇంటి స్ట్రక్చర్‌పై 10 ఏళ్ల వారెంటీ ఇస్తున్నాం. 


ఎన్ని ఇళ్లు నిర్మించారు?

కంపెనీని 2017లో ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 4 లక్షల చదరపు అడుగుల ఇంటి నిర్మాణ పనులు చేతిలో ఉన్నాయి. ఇందులో 50-60 వేల చ.అ ఇంటి నిర్మాణా న్ని పూర్తి చేశాం. హైదరాబాద్‌ కొండాపూర్‌లోనే 6 ప్రాజెక్టులు చేశాం. మొత్తం 60 మం దికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. 2021 మధ్య నాటికి తెలుగు రాష్ట్రాలోని వరంగల్‌, కర్నూల్‌, విశాఖపట్నం, విజయవాడ, కర్నాట కలోని బెంగళూరుకు సేవలు విస్తరించను న్నాం. వచ్చే రెండేళ్లలో 25 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఆ స్థాయికి చేరితే.. మాకు మొత్తం రూ.180-200 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.  


విస్తరణకు నిధులు సమీకరించే యోచన ఉందా?

ఇప్పటివరకూ సొంత నిధులతోనే స్టార్ట్‌పను నిర్వహిస్తున్నాం. విస్తరణకు వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి మొదటి విడత నిధులను సమీకరించాలని భావిస్తున్నాం. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. రూ.8 కోట్లు సమీకరించనున్నాం.


రుసుము ఏ విధంగా, ఎంత వసూలు చేస్తున్నారు?

స్టాండర్డ్‌ ప్యాకేజీ కింద పూర్తి ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,500 వసూలు చేస్తున్నాం. ఏయే మెటిరీయల్‌ వాడుతున్నది. బ్రాండ్‌లు మొదలైనవన్నీ ఖాతాదారుకు ముం దుగానే తెలియజేస్తాం. ఇది కాకుండా ఖాతాదారు అభిరుచికి అనుగుణంగా నిర్మించినప్పుడు రుసుము వేరుగా ఉంటుంది. మెటీరియల్‌ కాకుండా ఇంజనీరింగ్‌, మానిటరింగ్‌, డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, స్ట్రక్చరల్‌ సేవలు మాత్రమే అందిస్తే చదరపు అడుగుకు రూ.150-250 తీసుకుంటున్నాం. అలాగే ఇల్లు బాగు చేయడం, పెయింటింగ్‌ వంటి పనులను కూడా ప్రారంభించనున్నాం. హైదరాబాద్‌లో ఎండ్‌-టు-ఎండ్‌  సేవలందిస్తున్నా.. ఇతర పట్టణాల వారికి ఆన్‌లైన్‌ ద్వారా డిజైన్‌, ఆర్కిటెక్చరల్‌ సేవలు అందిస్తున్నాం. 


Updated Date - 2020-12-01T06:34:41+05:30 IST