సంచలనం: జీయోలో గూగుల్ భారీ పెట్టుబడి..!

ABN , First Publish Date - 2020-07-14T21:59:54+05:30 IST

భారత్‌లో డిజిటలీకరణకు 75 వేల కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిన గూగుల్ రిలయన్స్‌లోనూ భారీ పెట్టబోతోందా అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.

సంచలనం: జీయోలో గూగుల్ భారీ పెట్టుబడి..!

ముంబై: భారత్‌లో డిజిటలీకరణకు 75 వేల కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిన గూగుల్..రిలయన్స్‌లోనూ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోందా అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. రిలయన్స్ సంస్థలకు చెందిన డిజిటల్ వేదికల్లో ఏకంగా 4 బిలియన్ డాలర్లు (రూ.30 వేల కోట్ల నిధులను) ఇన్వెస్ట్ చేసేందుకు గూగుల్ యోచిస్తుందని, ఈ దిశగా రిలయన్స్‌తో జరుపుతున్న చర్చలు కీలక దశలో ఉన్నాయనే కథనాలు వెలువడుతున్నాయి.


అయితే గూగుల్ మాత్రం ఈ వార్తపై స్పందించేందుకు నిరాకరించిందని సమాచారం. రిలయస్స్ నుంచి కూడా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా వెలువడలేదు. ప్రస్తుతం రిలయన్స్ జీయో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ జియోలో వాటాను కొనుగోలు చేయడంతో ఈ పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పటివరకూ దాదాపు 25 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంస్థ 1.17 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను సేకరించింది. రిలయన్స్‌ను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగానే సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ  ఈ పెట్టుబడుల సమీకరణకు పూనుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రిలయన్స్‌.. భారత డిజిటల్ ప్రపంచంలో దూసుకుపోతుందన్న నమ్మకమే మదుపర్లను ఆ సంస్థవైపు ఆకర్షిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-07-14T21:59:54+05:30 IST