గోల్డ్ లోన్ వర్సెస్ వ్యక్తిగత రుణం ఏది మేలు..?
ABN , First Publish Date - 2020-07-05T05:47:12+05:30 IST
కరోనా కాలం. కష్టాల సమయం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా..? రుణం తీసుకునే ఆలోచనలో ఉన్నారా..? అయితే, మీ ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి...
కరోనా కాలం. కష్టాల సమయం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా..? రుణం తీసుకునే ఆలోచనలో ఉన్నారా..? అయితే, మీ ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. వ్యక్తిగత రుణం లేదా బంగారం తాకట్టుపై రుణం. ఈ రెండింటిలో ఏదైతే మేలు..? అనేగా మీ సందేహం. మీ వ్యక్తిగత అవసరం, ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీకోసం..
గోల్డ్ లోన్, పర్సనల్ లోన్.. ఆర్థిక అవసరంతో నిమిత్తం లేకుండా పొందగలిగే రుణాలు. అంటే, తీసుకున్న రుణ నిధులను ఫలానా అవసరం కోసమే ఉపయోగించాలన్న షరతులేమీ ఉండవు. పైగా, ఆర్థిక అత్యవసరాలను తీర్చుకునేందుకు అతి తక్కువ సమయంలో తీసుకోగలిగే రుణాలు. మీ వద్ద తాకట్టు పెట్టేందుకు బంగారం లేకుంటే మాత్రం వ్యక్తిగత రుణమే ప్రత్యామ్నాయం. ఎంతో కొంత బంగారం ఉన్న వారు తమ ఆర్థిక అవసరం, పరిస్థితిని బట్టి ఈ రెండు రుణాల్లో అనువైన దాన్ని, చౌకగా లభించేదాన్ని ఎంచుకోవాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనవారు, తీసుకోబోయే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు అధిక సమయం పడుతుందనుకునే వారు పర్సనల్ లోన్ ఎంచుకోవడం మేలు. చిన్న మొత్తాల్లో రుణాన్ని తక్కువ సమయంలోనే తీర్చివేయగలమన్న ధీమా ఉంటే బంగారం రుణాన్ని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత రుణం పొందేందుకు అవసరమైన క్రెడిట్ స్కోర్ లేని వారికీ ఇది మెరుగైన ప్రత్యామ్నాయం. ఈ రెండు రుణాల గురించి మరిన్ని వివరాలు..
ప్రాసెసింగ్ సమయం
వ్యక్తిగత రుణం
సాధారణంగా 2-7 రోజుల సమయం పడుతుంది. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్షణ రుణాన్ని సైతం ఆఫర్ చేస్తున్నాయి. రుణగ్రహీత వేతన స్లిప్లు లేదా వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులతో పాటు ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
గోల్డ్ లోన్
సాధారణంగా బ్యాంక్ లేదా ఇతర సంస్థలు బంగారం తాకట్టు పెట్టిన రోజునే రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణం కోసం మీరు సంప్రదించిన శాఖలో గోల్డ్ అప్రైజర్ అందుబాటులో లేని పక్షంలో 2-3 రోజుల వరకు సమయం పట్టవచ్చు.