తగ్గిన బంగారం దిగుమతులు
ABN , First Publish Date - 2020-03-16T06:33:13+05:30 IST
బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. మార్కెట్ నీరసించడంతో పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో (2019 ఏప్రిల్-2020 ఫిబ్రవరి) బంగారం దిగుమతులు...
11 నెలల్లో 8.86 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ : బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. మార్కెట్ నీరసించడంతో పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో (2019 ఏప్రిల్-2020 ఫిబ్రవరి) బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8.86 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 2,962 కోట్ల డాలర్లు ఉన్న పసిడి దిగుమతులు.. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి 11 నెలల్లో 2,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.9 లక్షల కోట్లు) దిగొచ్చాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 17,300 కోట్ల డాలర్ల నుంచి 14,312 కోట్ల డాలర్లకు తగ్గింది.
ఎందుకంటే ?
మన దేశం ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో కొంత భాగాన్ని నగలుగా మార్చి ఎగుమతి చేస్తుంటారు. పసిడి దిగుమతులపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచడం పరిశ్రమ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీన్ని నాలుగు శాతానికి తగ్గించాలని తాము కోరుతుంటే, ప్రభుత్వం 12.5 శాతానికి పెంచడాన్ని పరిశ్రమ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ భారం తగ్గించుకునేందుకు కొంత మంది ఆభరణాల ఎగుమతిదారులు పన్నులు తక్కువగా ఉండే పొరుగు దేశాలకు తమ వ్యాపారాలను మార్చారు. దీనికి తోడు ఆర్థిక మందగమనంతో దేశీయ కొనుగోళ్లూ నీరసించాయి. ఇవన్నీ పసిడి దిగుమతులను దెబ్బతీస్తున్నాయి.