రూ. పాతిక వేల కోట్ల సేకరణకు కేంద్రం అనుమతి : ఆ బ్యాంకులకు ఊరట
ABN , First Publish Date - 2020-12-20T23:18:13+05:30 IST
జాతీయ బ్యాంకులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ప్రాతిపదికగా ఈ నిర్ణయానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. వచ్చే మూడు నెలలకాలంలో మార్కెట్ నుంచి రూ. 25 వేల కోట్ల మొత్తాన్ని సేకరించడానికి జాతీయ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

న్యూఢిల్లీ : జాతీయ బ్యాంకులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ప్రాతిపదికగా ఈ నిర్ణయానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. వచ్చే మూడు నెలలకాలంలో మార్కెట్ నుంచి రూ. 25 వేల కోట్ల మొత్తాన్ని సేకరించడానికి జాతీయ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేబాశీష్ పండా ఈ నిర్ణయాన్ని ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం కాలానికి రూ. 25 వేల కోట్లను మార్కెట్ నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించుకునేందుకుగాను జాతీయ బ్యాంకులకు అనుమతినిచ్చినట్లు తెలిపారు.
గతంలో కెనరా బ్యాంకు రూ. 2 వేలకోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 3,788.04 కోట్లను లిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా సమీకరించుకున్నాయి. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం మరో రూ. 20 వేల కోట్లను జాతీయ బ్యాంకుల్లో మూలధన పెట్టుబడిగా పెట్టింది.
అయినప్పటికీ... పంజాబ్ అండ్ సింద్ వంటి కొన్ని బ్యాంకులు ప్రభుత్వం రూపొందించిన రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందుకోలేకపోయాయి. ఫలితంగా- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో రూ. 5,500 కోట్లను మూలధన పెట్టుబడిగా ప్రకటించింది.
కాగా... ఈ ఏడాది మార్చి 31 తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ బ్యాంకులు ఏకంగా రూ. 70 వేల కోట్లను సమీకరించాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 16,091 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,768 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 6,571 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 2,534 కోట్ల వాటాలను నమోదు చేశాయి.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మొత్తం పన్నెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పదకొండు బ్యాంకులు లాభాలను ఆర్జించినట్లు దేబాశీస్ పండా తెలిపారు. నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మెన్స్ అసెట్స్ఏ) తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఎన్పీఏలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.