డిసెంబరులోగా కేజీ బేసిన్‌లో మళ్లీ గ్యాస్‌ ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-11-03T05:54:11+05:30 IST

కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుం చి మళ్లీ గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) రెడీ అవుతోంది. కేజీ-డీ6 బ్లాకులోని ఆర్‌-సీరిస్‌ క్షేత్రం నుంచి ఈ నెల లేదా డిసెంబరులోగా గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు...

డిసెంబరులోగా కేజీ బేసిన్‌లో మళ్లీ గ్యాస్‌ ఉత్పత్తి

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడి 


న్యూఢిల్లీ: కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుం చి మళ్లీ గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) రెడీ అవుతోంది. కేజీ-డీ6 బ్లాకులోని ఆర్‌-సీరిస్‌ క్షేత్రం నుంచి ఈ నెల లేదా డిసెంబరులోగా గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఇన్వెస్టర్లకు వెల్లడించింది. ‘ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూ ర్తయ్యాయి. ఇంకా కొన్ని చిన్నచిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. అవి కూడా పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెలాఖరుకల్లా ఆర్‌-సీరిస్‌ క్షేత్రంలోని బావుల నుంచి గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభిస్తాం’ అని వాటాదారులకు కంపెనీ తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ నుంచే ఈ క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా పనులు ఆలస్యం కావడంతో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించడం ఆలస్యమైంది. ఈ గ్యాస్‌ కొనుగోలు కోసం ఎస్సార్‌ స్టీల్‌, అదానీ గ్రూప్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  


2024 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తి 

కేజీ-డీ6 క్షేత్రంలోని ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్స్‌, ఎంజే పేరుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం మూడు క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఆర్‌-క్లస్టర్‌లో ఈ డిసెంబరులోగా గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మిగతా రెండు క్షేత్రాల్లో 2024 కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోం ది. ఈ మూడు క్షేత్రా లు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే రోజుకు 2.8 కోట్ల ఎంఎ స్‌సీఎండీ గ్యాస్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. 


నష్టాలకు బ్రేక్‌

సెన్సెక్స్‌ హెవీ వెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నిరాశ పరిచినా సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల అండతో సెన్సెక్స్‌ 143.51 పాయింట్ల లాభంతో 39,757.58 వద్ద, 26.75 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,669.15 వద్ద ముగిసింది. 


షేరు ఢమాల్‌

రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హాంఫట్‌

కుబేరుల జాబితాలో తగ్గిన ముకేశ్‌ అంబానీ స్థానం 


ఆర్‌ఐఎల్‌ షేరు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. సెప్టెంబరు త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో పాటు ఆర్‌ఐఎల్‌ షేరు రూ.1,320 స్థాయికి పడిపోవచ్చన్న ఒక బ్రోకరేజీ సంస్థ నివేదిక మదుపరులను భయపెట్టింది. దీంతో బీఎస్‌ఈలో కంపెనీ షేరు  8.62ు నష్టంతో రూ.1,877.30 వద్ద క్లోజవగా ఎన్‌ఎస్‌ఈలో 8.61ు నష్టపోయి 1,877.45 వద్ద ముగిసింది. కాగా, ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ ఒక్కరోజే రూ.లక్ష కోట్లకుపైగా తుడిచి పెట్టుకుపోయింది. మరోవైపు ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నికర ఆస్తుల విలువ సోమవారం 680 కోట్ల డాలర్లు తగ్గి 7,150 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.24 లక్షల కోట్లు) పడిపోయింది. ఈ దెబ్బతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ ఆరో స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయారు. 


Updated Date - 2020-11-03T05:54:11+05:30 IST