ఇంధనానికి భారీగా తగ్గిన డిమాండ్

ABN , First Publish Date - 2020-03-20T02:01:54+05:30 IST

కరోనా వైరస్ ప్రభావం ఇంధనం వినియోగం పైనా పడింది. వైరస్ భయం నేపథ్యంలో విమానాలు పెద్ద

ఇంధనానికి భారీగా తగ్గిన డిమాండ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం ఇంధనం వినియోగం పైనా పడింది. వైరస్ భయం నేపథ్యంలో విమానాలు పెద్ద ఎత్తున రద్దు కావడం, పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలో ఈ నెల తొలి రెండు వారాల్లో ఇంధన డిమాండ్ 10-11 శాతం తగ్గింది. అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది మార్చిలో 19.5 మిలియన్ టన్నుల పెట్రో ఉత్పత్తులు వినియోగం కాగా, మొదటి పక్షం రోజుల్లో 10 మిలియన్ టన్నుల ఇంధనం వినియోగమైంది. అయితే, ఈ నెలలో మాత్రం తొలి పదిహేను రోజుల్లో ఇంధన డిమాండ్ 10-11 శాతం తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ద్రవ ఇంధన వినియోగం భారీగా తగ్గినట్టు పేర్కొంది. ప్రయాణాలపై ఆంక్షలు, పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గడం వల్లే ఇంధనానికి డిమాండ్ తగ్గినట్టు వివరించింది. డీజిల్ అమ్మకాలు 13 శాతం పడిపోగా, జెట్ ఇంధన అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. పెట్రోలు అమ్మకాలు రెండుశాతం తగ్గాయి. అయితే, 2021 ఆర్థిక సంవత్సరంలో మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2-3 శాతం పెరిగే అవకాశం ఉందని ఐవోసీ తెలిపింది. 

Updated Date - 2020-03-20T02:01:54+05:30 IST