వీలైనంత త్వరగా సొమ్ము తిరిగిచ్చేస్తాం..
ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST
ఫండ్ పథకాలను మూసివేసినంత మాత్రాన ఇన్వెస్టర్లు సొమ్ము కోల్పోయినట్లు కాదని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ అంటోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు వీలైనంత త్వరగా సొమ్మును తిరిగిచ్చేస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్...

- మదుపర్లతో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్
ఫండ్ పథకాలను మూసివేసినంత మాత్రాన ఇన్వెస్టర్లు సొమ్ము కోల్పోయినట్లు కాదని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ అంటోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు వీలైనంత త్వరగా సొమ్మును తిరిగిచ్చేస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) ప్రెసిడెంట్ సంజయ్ సప్రే అన్నారు. తద్వారా వారి విశ్వాసాన్ని తిరిగి పొందుతామన్నారు. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, డైనమిక్ అక్యురల్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్, షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ప్లాన్, అలా్ట్ర షార్ట్ బాండ్ ఫండ్, ఇన్‌కమ్ ఆపర్చూనిటీస్ ఫండ్ పథకాలను మూసివేస్తున్నట్లు గత వారంలో కంపెనీ ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం మదుపర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు, బాండ్ మార్కెట్లో ద్రవ్య లభ్యత లేకపోవడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఈనెల 22 నాటికి ఈ ఆరు ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.25,856 కోట్లు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోందీ అంతర్జాతీయ ఫండ్ కంపెనీ. దీని ప్రపంచవ్యాప్త సిబ్బందిలో 33 శాతం ఇండియాలోనే పనిచేస్తున్నారు.
కంపెనీ యాజమాన్యాన్ని టేకోవర్ చేయాలి: ఏఎన్‌ఎంఐ
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ‘ఏఎన్‌ఎంఐ’ ప్రభుత్వాన్ని, సెబీని కోరింది. ఈ నెల 26న ఆర్థిక శాఖతోపాటు సెబీకి లేఖ రాసింది. ఈ ఫండ్ సంస్థ యాజమాన్యాన్ని టేకోవర్ చేసుకోవడంతోపాటు కంపెనీ గత పెట్టుబడుల నిర్ణయాలపై దర్యాప్తు జరిపించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని డిమాండ్ చేసింది.