వచ్చేది కనీవినీ ఎరుగని బడ్జెట్‌

ABN , First Publish Date - 2020-12-19T06:01:00+05:30 IST

వచ్చే కేంద్ర బడ్జెట్‌ ప్రాధాన్యతల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘ఈ బడ్జెట్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది.

వచ్చేది కనీవినీ ఎరుగని బడ్జెట్‌

మౌలికానికి మరిన్ని నిధులు

దెబ్బతిన్న రంగాలకు చేయూత

వృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌


న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌ ప్రాధాన్యతల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘ఈ బడ్జెట్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది. గత వందేళ్లలో ఎవరూ ప్రవేశ పెట్టని రీతిలో ఈ బడ్జెట్‌ ఉంటుంది’ అని సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రకటించారు. పరిశ్రమ వర్గాలు కూడా ఈ బడ్జెట్‌ కోసం తమ సలహాలు, సూచనలు పంపాలని కోరారు. వృద్ధి కి పెద్ద పీట వేస్తూ కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా తన బడ్జెట్‌ ఉంటుందన్నారు. 


మౌలికానికి పెద్ద పీట: రాబోయే సాధారణ బడ్జెట్‌లో సామాజిక మౌలిక రంగానికి మరిన్ని పెట్టుబడులు ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్యం, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) వంటి రంగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో ఆస్పత్రుల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. ఆరోగ్య రంగంలో ముందు ముందు టెలిమెడిసిన్‌ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. దీని నిర్వహణకు నైపుణ్యాలు అత్యంత కీలమని స్పష్టం చేశారు. 


వృద్ధికి చుక్కాని: కొవిడ్‌ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్‌ కీలకం కానుందని నిర్మల అన్నారు. ‘జనాభా, విస్తీర్ణం, అవకాశాల పరంగా చూస్తే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం భారత్‌కు ఉంది. ఇతర దేశాలతో కలిసి మన దేశం ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి కావాలని చెప్పేందుకు నేను వెనుకాడను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలోనూ మన పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండబోతోంది’ అని అన్నారు. కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు చేయూత ఇవ్వడంతో పాటు వృద్ధికి దోహదం చేసే కొత్త రంగాలనీ వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సహిస్తామన్నారు. 


ఎగుమతి అవకాశాలు: దేశ అవసరాలతో పాటు కొవిడ్‌తో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఎగుమతి చేసే సత్తా మన దేశానికి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, సామర్ధ్య ధ్రువీకరణ తర్వాత, ఎక్కడ  కొనాలని ఇప్పటికీ కొన్ని దేశాలు తర్జనభర్జన పడుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. భారత్‌కు మాత్రం అలాంటి బెంగ లేదన్నారు. ఇతర దేశాల్లో అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్ల మేధో సంపత్తి హక్కులు కొనుక్కుని.. వాటిని పూర్తిగా దేశంలోనే తయారు చేసే సత్తా భారత కంపెనీలకు ఉందన్నారు. 


కొలువులకు కొత్త నైపుణ్యాలు: కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగాల స్వరూపమూ మారిపోతోందని నిర్మల చెప్పారు. టెలిమెడిసిన్‌ వంటి రంగాల్లో పని చేసేందుకు కొత్త నైపుణ్యాలు అవసరమన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో  కొత్త నైపుణ్యాల శిక్షణకూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

Read more