హైదరాబాద్‌కు ఫియట్‌ క్రిస్లర్‌

ABN , First Publish Date - 2020-12-17T07:17:27+05:30 IST

ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది ఎఫ్‌సీఏకు ఉత్తర అమెరికా,

హైదరాబాద్‌కు ఫియట్‌ క్రిస్లర్‌

రూ.1050 కోట్లతో ఇన్నోవేషన్‌ కేంద్రం  

1000 మందికి ఉద్యోగాలు

ఉత్తర అమెరికా వెలుపల అతిపెద్దది


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది ఎఫ్‌సీఏకు ఉత్తర అమెరికా, యూరప్‌, పశ్చిమాసియా, అఫ్రికా వెలుపల అతిపెద్ద ఇన్నోవేషన్‌ కేంద్రం అవుతుంది.

15 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,050 కోట్లు) పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ  కేంద్రం 2021 చివరి నాటికి  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లోని దాదాపు 1,000 మంది నిపుణులకు ఉద్యోగావకాశం కల్పించనుందని ఎఫ్‌సీఏ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థదత్తా తెలిపారు. ముంబై ప్రధాన కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎఫ్‌సీఏకు మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో వాహన, పవర్‌ట్రైన్‌ తయారీకి సంయుక్త సంస్థ ఉంది. పుణె, చెన్నైల్లో ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.


వినూత్న ఉత్పత్తుల అభివృద్ధి

మొబిలిటీ రంగలో సరికొత్త ఉత్పత్తులు, భావనలను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్‌ కేంద్రం దృష్టి సారిస్తుందని ఎఫ్‌సీఏ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (ఉత్తర అమెరికా, ఆసియా ఫసిఫిక్‌) మమత చామర్తి తెలిపారు.  కనెక్టెడ్‌ వెహికల్‌ ప్రోగ్రామ్స్‌, పాసింజర్‌ సేఫ్టీ, డిజిటల్‌ షోరూమ్‌లు, ఏఐ, డేటా యాసిలిరేటర్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి వాటిపై వ్యూహాత్మక వినూత్నాలను ఈ హబ్‌ అభివృద్ధి చేస్తుందన్నారు.

నిపుణుల లభ్యత, ప్రభుత్వ అనుకూల విఽధానాలు, మౌలిక సదుపాయాలు పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో ఈ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎఫ్‌సీఏ ఐసీటీ ఇండియా అధిపతి కరీమ్‌ లలానీ తెలిపారు. 
విడిభాగాల యూనిట్‌ పెట్టండి: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్టోరేజీ వ్యవస్థల పాలసీని విడుదల చేసింది. ఈ రంగంలో త్వరలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఎఫ్‌సీఏ కూడా హైదరాబాద్‌లో విడి భాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కోరారు.

ఎఫ్‌సీఏ హైదరాబాద్‌ను ఎంచుకుని సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ఇంజినీరింగ్‌ కార్యకలాపాలను కూడా హైదరాబాద్‌లో ప్రారంభించి ఎఫ్‌సీఏ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను మారుపేరుగా తీర్చిదిద్దాలని కోరారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. 


Updated Date - 2020-12-17T07:17:27+05:30 IST