గాడిలో పడిన ఎగుమతులు

ABN , First Publish Date - 2020-10-03T07:13:11+05:30 IST

భారత ఎగుమతుల రంగం ఆరు మాసాల తిరోగమనం నుంచి బయటపడింది...

గాడిలో పడిన ఎగుమతులు

సెప్టెంబరులో 5.27 శాతం వృద్ధి


న్యూఢిల్లీ : భారత ఎగుమతుల రంగం ఆరు మాసాల తిరోగమనం నుంచి బయటపడింది. సెప్టెంబరులో ఎగుమతులు 5.27 శాతం వృద్ధితో 2,740 కోట్ల డాలర్లకు (రూ.2.05 లక్షల కోట్లు) చేరాయి. కాని దిగుమతులు మాత్రం 19.6 శాతం క్షీణించి 3,031 కోట్ల డాలర్లకే (రూ.2.27 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరులో వాణిజ్య లోటు గత సెప్టెంబరుతో పోల్చితే 1,167 కోట్ల డాలర్ల నుంచి 291 డాలర్లకు (రూ.21,825 కోట్లు) తగ్గింది. గత ఏడాది సెప్టెంబరులో ఎగుమతులు 2602 కోట్ల డాలర్ల (రూ.1.95 లక్షల కోట్లు) స్థాయిలో ఉన్నాయి. కాగా ఏప్రిల్‌-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో ఎగుమతులు 21.43 శాతం క్షీణించి 12,506 కోట్ల డాలర్లుగాను (రూ.9.38 లక్షల కోట్లు) దిగుమతులు 40.06 శాతం ప్రతికూల వృద్ధితో 14,869 కోట్ల డాలర్లుగాను (రూ.11.15 లక్షల కోట్లు) నమోదయ్యాయి.


పెరిగిన కమోడిటీ ఎగుమతులు

సెప్టెంబరు నెలలో ప్రధానంగా కమోడిటీ ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇనుప ఖనిజం, బియ్యం, ఆయిల్‌ మీల్‌, కార్పెట్లు, ఫార్మా, మాంసం, డెయిరీ, పౌల్ర్టీ ఉత్పత్తులు, నూలుదారం, ఫ్యాబ్రిక్స్‌, తయారీ ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ వస్తువులు, రసాయనాలు, కాఫీ ఎగుమతులు పెరిగాయి. 


ఆయిల్‌ దిగుమతులు సెప్టెంబరు నెలలో 35.92 శాతం దిగజారి 582 కోట్ల డాలర్లకు పరిమితం కాగా ఏప్రిల్‌-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో 51.14 శాతం దిగజారి 3,185 కోట్ల డాలర్లకు పడిపోయాయి.


బంగారం దిగుమతులు సెప్టెంబరులో 52.85 శాతం తగ్గాయి. నాన్‌ ఆయిల్‌ దిగుమతులు 14.41 శాతం క్షీణించి 2,448 కోట్ల డాలర్లకు చేరాయి. ప్రధమార్ధంలో ఇవి 36.12 శాతం తగ్గి 11,683 కోట్ల డాలర్లకే పరిమితమయ్యాయి.

Updated Date - 2020-10-03T07:13:11+05:30 IST