‘ఈఎంఐ’లకు విరామం
ABN , First Publish Date - 2020-04-01T06:19:54+05:30 IST
గృహ, ఆటో, పంట రుణాలు సహా అన్ని రకాల కాలపరిమితి రుణాల ఈఎంఐలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మూడు నెలల మారటోరియం ఎలా వర్తిస్తుందనే విషయంలో పలు బ్యాంకులు తమ శాఖలను...

స్పష్టతనిస్తున్న బ్యాంకులు
జూన్ తర్వాతే తిరిగి చెల్లింపుల ప్రక్రియ షురూ
ఈసీఎస్ రద్దు దానంతటదే జరగదు.. రిక్వెస్ట్ పంపాల్పిందే..
క్రెడిట్ కార్డులకు చక్రవడ్డీ తప్పదు
మినిమం బ్యాలెన్స్ చెల్లించడం మంచిది
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కోత
న్యూఢిల్లీ: గృహ, ఆటో, పంట రుణాలు సహా అన్ని రకాల కాలపరిమితి రుణాల ఈఎంఐలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మూడు నెలల మారటోరియం ఎలా వర్తిస్తుందనే విషయంలో పలు బ్యాంకులు తమ శాఖలను చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టాయి. కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను పరిగణనలోకి తీసుకుని వివిధ రుణాల నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు ఆర్బీఐ మూడు నెలల విరామం ప్రకటించిన విషయం విదితమే. ఈ సదుపాయం కల్పించడంతో పాటు ఆర్బీఐ ప్రకటించిన వివిధ స్కీమ్‌ల గురించి సవివరమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు ఆయా బ్యాంకులు మంగళవారంనాడు ప్రకటించాయి. ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తమ ట్విటర్ హ్యాండిళ్లపై సందేశాలు పోస్ట్ చేయడంతో పాటు కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు కూడా మెసేజ్‌లు పంపుతున్నామని వివిధ బ్యాంకులు తెలిపాయి.
ఇప్పటికే పలు బ్యాంకుల కస్టమర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లపై ఈఎంఐల చెల్లింపునకు సంబంధించి అలర్ట్‌లు వస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తక్షణం తగుచర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో పలు బ్యాంకులు తమ బ్రాంచీలను, కస్టమర్లను చైతన్యవంతులను చేసే చర్యలు చేపట్టాయి. అలాగే ఆర్బీఐ ప్రకటనపై పలువురికి తరచుగా కలుగుతున్న అనుమానాలు, వాటికి సమాధానాలు కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రూపొందిస్తోంది. బ్యాంకులు ఈఎంఐల వాయిదాపై తమ వైఖరిని తెలియచేయడంతో ఇప్పుడు తమలో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతున్నాయని పలువురు కస్టమర్లు చెబుతున్నారు.
ఈసీఎస్ చెల్లింపులు వాయిదా వేసుకోవడం ఎలా...?
లీగల్ సమస్యల కారణంగా బ్యాంకులు ఏకపక్షంగా ఎలకా్ట్రనిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్) చెల్లింపులు వాయిదా వేయడానికి వీలు లేదు. బ్యాంకు వెబ్సైట్ల ద్వారా కస్టమర్లు ఈఎంఐ వాయిదా అప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తమ ఈఎంఐను నిలిపి వేయాలని రిక్వెస్ట్ పంపాలి. తగినన్ని ఆర్థిక వనరులు ఉండి నగదు నిల్వలున్న వారు యథాప్రకారం ఈఎంఐలు చెల్లించవచ్చు. ఇందుకు బ్యాంకుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తవు.
ఏయే బ్యాంకులు వాయిదా వేశాయంటే..
ఎస్బీఐ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బీఓబీ.
ఏ బ్యాంకు ఏమంది?
ఎస్బీఐ: మార్చి ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అన్ని కాలపరిమితి రుణాల ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసేందుకు చర్యలు తీసుకున్నాం. అలాగే అదే కాలపరిమితికి వర్తింపచేస్తూ వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీలను కూడా వాయిదా వేయడం జరిగింది.
కెనరా బ్యాంక్: ఆర్బీఐ ప్రకటించిన కోవిడ్-19 ప్యాకేజీకి అనుగుణంగా మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు అన్ని రుణాలపై ఈఎంఐ చెల్లింపులను ఆ తర్వాత తేదీలకు వాయిదా వేయటం జరిగింది. దీనికి అనుగుణంగా రుణం రీపేమెంట్ కాలపరిమితి పెరుగుతుంది.
ఐడీబీఐ బ్యాంక్: అన్ని రకాల రుణాలపై ఈఎంఐల చెల్లింపును మూడు నెలల పాటు వాయిదా వేశాం. తగినంత నగదు నిల్వలుండి ఈ సదుపాయం అవసరం లేదనుకునే కస్టమర్లు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే చెల్లింపులు చేస్తామని బ్యాంకుకు తెలియచేయాల్సి ఉంటుంది. moratorium@idbi.co.in అనే ఈ-మెయిల్‌కు సందేశాలు పంపుతూ లోన్ అకౌంట్ నంబర్, రుణగ్రహీత పేరు వంటి వివరాలు అందించాలి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అన్ని రకాల రుణాలపై ఈఎంఐల చెల్లింపులను మూడు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకు శాఖలన్నింటికీ సమాచారం పంపామని ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. ఈసీఎస్ విధానంలో ఈఎంఐలు చెల్లిస్తున్న వారు ఈ మెయిల్ లేదా ఇతర డిజిటల్ విధానంలో తాము ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నట్టు ఆయా బ్యాంకు శాఖలకు తెలియచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
క్రెడిట్ కార్డులకు చక్రవడ్డీ తప్పదు
అన్ని రకాల రుణాల ఈఎంఐలు వాయిదా వేయడంతో పాటు క్రెడిట్ కార్డుల చెల్లింపులు కూడా వాయిదా వేయాలని ఆర్బీఐ సూచించింది. అంటే క్రెడిట్ కార్డులపై ఆయా కస్టమర్లు ఉపయోగించుకున్న మొత్తం బ్యాలెన్స్, వడ్డీ చెల్లింపు అన్నింటికీ ఆ మూడు నెలల విరామం వర్తిస్తుంది. ఆ రకంగా ప్రతీ నెలా కనీసం చెల్లించాల్సిన ‘మినిమమ్ బ్యాలెన్స్ డ్యూ’ చెల్లించకపోయినా ఫర్వాలేదు. గతంలో వలె క్రెడిట్ కార్డు కంపెనీలు కస్టమర్‌ను చెల్లింపు నిమిత్తం వెంటాడవు. కానీ ఆ సదుపాయం ఉపయోగించుకుంటే మాత్రం కస్టమర్లకు గల క్రెడిట్ కార్డు బకాయి మొత్తం మీద చక్రవడ్డీ విధిస్తారు. అంటే కస్టమర్‌కు భారం తడిసి మోపడవుతుందన్న మాట. ఉదాహరణకి ఎవరైనా కస్టమర్‌కు మార్చి 1 నాటికి కార్డుపై మొత్తం బకాయి రూ.50,000 ఉందనుకుంటే మూడు నెలల విరామం ముగిసే సమయానికి అతను చెల్లించాల్సిన మొత్తం అమాంతం రూ.58,000కి పెరిగిపోతుంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవాలంటే నెలవారీ మినిమం బ్యాలెన్స్ డ్యూ చెల్లించడం మంచిదని బ్యాంకర్లు అంటున్నారు.