జీవీకేపై ఈడీ కేసు
ABN , First Publish Date - 2020-07-08T06:24:20+05:30 IST
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్)లో రూ.705 కోట్ల నిధుల అక్రమాలకు సంబంధించి జీవీకే గ్రూప్ ప్రమోటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది...

న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్)లో రూ.705 కోట్ల నిధుల అక్రమాలకు సంబంధించి జీవీకే గ్రూప్ ప్రమోటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జీవీకే ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆఽధారంగా ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నిధుల దుర్వినియోగం జరిగిందని ఈడీ అధికారులు మంగళవారం నాడు జీవీకే గ్రూప్ ప్రధాన ప్రమోటర్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు, ఎంఐఏఎల్ ఎండీ సంజయ్ రెడ్డిలపై ఈ కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ కేసులో జీవీకే ప్రమోటర్లకు సంబంఽధం ఉన్న తొమ్మిది కంపెనీల అధికారులు, భారతీయ విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ) ఉన్నతాధికారులపైనా ఈడీ కేసులు నమోదు చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టుకునేందుకు త్వరలోనే ఈడీ అధికారులు వీరికి నోటీసులు జారీ చేస్తుందని భావిస్తున్నారు.