డిజిటల్‌ చెల్లింపుల జోరు

ABN , First Publish Date - 2020-10-12T06:14:42+05:30 IST

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ రంగంలో ఏటా సగటున 55.1 శాతం వృద్ధి రేటు నమోదైంది...

డిజిటల్‌ చెల్లింపుల జోరు

  • ఏటా 55.1 శాతం చొప్పున వృద్ధి 
  • రూ.1,623 లక్షల కోట్లకు చేరిక 

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ రంగంలో ఏటా సగటున 55.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆర్‌బీఐ విడుదల చేసింది. 2016 మార్చి నాటికి 593.61 కోట్లున్న డిజిటల్‌ లావాదేవీలు ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 3,434.56 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో డిజిటల్‌ లావాదేవీల విలువ కూడా ఏటా సగటున 15.2 శాతం వృద్ధి రేటుతో రూ.920.38 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 లక్షల కోట్లకు చేరాయి.


దెబ్బతీసిన ఆర్థిక మందగమనం  

గత ఆర్థిక సంవత్సరం (2019-20) డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు 2,343.40 కోట్ల నుంచి 3,434.56 కోట్లకు పెరిగినా.. లావాదేవీల విలువ మాత్రం రూ.1,638.52 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 లక్షల కోట్లకు పడిపోయాయి. ఆర్థిక మందగమనంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవటంతో ప్రజలు ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్న నాలుగు రాళ్లు ఆదా చేసుకునేందుకు మొగ్గు చూపడం ఇందుకు ప్రధాన కారణం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ప్రస్తత ఆర్థిక సంవత్సరం డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య భారీగా పెరిగినా, చెల్లింపుల విలువ మాత్రం తగ్గుతుందని భావిస్తున్నారు.


‘ఎన్‌జీటీఏ’తో మారక, పసిడి నిల్వల నిర్వహణ

దేశ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు, పసిడి నిల్వలను కొత్త పద్దతిలో నిర్వహించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఎన్‌జీటీఏగా పిలిచే ఈ వెబ్‌ ఆధారిత మలితరం ఖజానా అప్లికేషన్‌తో వీటి నిర్వహణ పనితీరు మరింత సమర్ధవంతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది.


వృద్ధికి కారణాలివే..

  1. పెద్ద నోట్ల రద్దు
  2. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఈసీఎస్‌ చెల్లింపులు
  3. యూపీఐ, యాప్‌ ఆధారిత చెల్లింపులతో మరింత ఊతం
  4. బ్యాంకింగేతర సంస్థలు అందిస్తున్న డిజిటల్‌ చెల్లింపుల సేవలు
  5. ప్రజలు డిజిటల్‌ చెల్లింపులకు మొగ్గు చూపడం
  6. చెల్లింపుల భద్రతకు ఆర్‌బీఐ తీసుకున్న ప్రత్యేక చర్యలు
  7. కాంటాక్ట్‌లెస్‌ కార్డుల ప్రవేశం

Updated Date - 2020-10-12T06:14:42+05:30 IST